బోథ్/ బేల/ ఆదిలాబాద్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా సొనాల, బేల జాతీయ రహదారిని సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు దిగ్బంధించారు. బేల మండల కేంద్రంలో సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ రఘునాథరావు ఆదిలాబాద్ రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవికి ఫోన్ చేయగా జోగు రామన్నతో శ్యామలాదేవి మాట్లాడి వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక రైతులను చిన్నచూపు చూస్తున్నాయని మండిపడ్డారు.
సొనాల మండల కేంద్రంలో సోయా, మొకజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు అంతర్రాష్ట్ర రహదారిపై రైతులతో కలిసి బైఠాయించారు. తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, సీఐ గురుస్వామి, ఏవోలు రైతులతో మాట్లాడి త్వరలోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన సీసీఐ అధికారులు రైతులు తెచ్చిన పత్తిలో తేమ 12 శాతానికి మించి ఉండటంతో కొనుగోలు చేయడానికి నిరాకరించారు. దీంతో రైతులు మార్కెట్ యార్డులో ఆందోళన చేపట్టగా కొనుగోళ్లు నిలిచాయి. ప్రైవేటు వ్యాపారులతో చర్చలు జరిపిన అధికారులు పత్తిని క్వింటాకు రూ.6950 చొప్పున కొనుగోలు చేయడానికి ఒప్పించారు. సీసీఐ కొనుగోలు చేయకపోవడంతో క్వింటాకు రూ.1000 చొ ప్పున నష్టపోయామని రైతులు పేర్కొన్నారు.