హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత పర్యవసానాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. పంటలకు తీవ్ర నష్టం తప్పదన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్నది. యూరియా కొరత వల్ల పంటలపై తీవ్ర ప్రభావం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పంటల ఎదుగుదల నుంచి దిగుబడి వరకు అన్నింటిపై ప్రభావం ఉంటుందని వివరిస్తున్నారు. శాస్త్రవేత్తల హెచ్చరికలకు అనుగుణంగానే సకాలంలో యూరియా అందకపోవడంతో పంటలు ఎర్రబారుతున్నాయి.
ఆకుపచ్చగా ఉండాల్సిన పంటలు పసుపుపచ్చగా మారుతున్నాయి. ఒకవేళ యూరియా సరైన సమయంలో అంది ఉంటే.. పంటలు పచ్చగా ఉండి ఏపుగా పెరిగేవని రైతులు అంటున్నారు. ముఖ్యంగా పత్తి, వరి పంటపై యూరియా కొరత ప్రభావం కనిపిస్తున్నది. సకాలంలో యూరియా వేయకపోవడంతో ఈ రెండు పంటలు దెబ్బతింటున్నాయి. మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్టుగా.. యూరియా కొరతకు తోడు భారీ వర్షాలతో పంటలకు మరింత నష్టం జరుగుతున్నది.
యూరియా కొరత కారణంగా పంటలు ఎదగడంలేదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వరి పైరులో ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేదని, పచ్చదనం కూడా కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రమాదం ఇంతటితో ఆగే అవకాశం లేదు. ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, ఎర్రబారడంతోపాటు చీడపీడలు సైతం ఎక్కువగా సోకే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పంటకు అన్ని రకాల ఎరువులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఏవేవో చీడ పీడలు సోకుతుంటాయని, ఇప్పుడు యూరియా కొరతతో పంట కాండం బలహీనమవుతుందని, తద్వారా పంటలకు అనేక రోగాలు సోకే ప్రమాదం ఉన్నదని చెప్తున్నారు.
అధిక చీడపీడలు సోకడంతో రైతులు వాటి నివారణకు అదనంగా పురుగుల మందులు పిచికారి చేయాల్సి ఉంటుందని, ఇది రైతులకు అదనపు భారమేనని చెప్తున్నారు. యూరియా కొరత కారణంగా వరిలో సాధారణ దిగుబడితో పోల్చితే 20-30% దిగుబడి తగ్గే ప్రమాదం ఉన్నదని, ఇదే కొరత మరో నెలపాటు కొనసాగితే మరో 10% దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే వంద క్వింటాళ్లు ఉత్పత్తి చేసే రైతుకు యూరియా కొరత కారణంగా 70 క్వింటాళ్లు మాత్రమే వచ్చే పరిస్థితి ఉంటుంది.
సాధారణంగా వరికి మూడు దఫాల్లో యూరియా చల్లుతారు. ప్రస్తుతం మెజార్టీ రైతులు మొదటి దశ యూరియా చల్లుతుండగా, కొందరు రైతులు రెండో దశ చల్లుతున్నారు. 20-25 రోజుల్లో తొలిసారి, 45 రోజుల్లో రెండోసారి, 65-70 రోజుల్లో మూడోసారి యూరియా చల్లుతారు. పత్తికి సైతం రెండుసార్లు యూరియా వేస్తారు. ప్రస్తుతం వరికి మొదటి దశ యూరియాను చల్లుతున్నారు. సెప్టెంబర్‌లో రెండో దశ యూరియా చల్లే అవకాశం ఉంటుంది. దీంతో యూరియా కొరత ఇదేవిధంగా కొనసాగితే చివరి రెండు దశలకు కూడా అవసరమైన యూరియా దొరకడం కష్టమే.
ఇదే జరిగితే పంటలు చేతికి రావడం కష్టమేనని, రైతులకు నష్టాలు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతున్నది. కాగా, ఇప్పటికీ క్షేత్రస్థాయిలో యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. కొన్ని గ్రామాల్లో యూరియా కోసం రైతులు రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిద్దిపేట జిల్లాలో ఒక ఏఈవో, ఒక ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్ల పహారాలో రైతులకు యూరియా టోకెన్లు పంపిణీ చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం సొసైటీ కార్యాలయం వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు యూరియా బస్తాల కోసం బారులు తీరారు. చంటిబిడ్డలతో వచ్చి గంటలతరబడి క్యూలో నిల్చున్నారు. అధికారులు పోలీసు పహారా మధ్య యూరియా పంపిణీ చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా అప్పయ్యపల్లి పీఏసీఎస్ వద్ద యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులు.
ఒక్కసారిగా భారీగా తరలిరావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ గుంపులుగా క్యూలో నిల్చున్న అన్నదాతలు
హనుమకొండ జిల్లా శాయంపేటలో రైతులతో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడారు. కొందరు పెద్దలకే యూరియా ఇస్తున్నారని, తమకు ఇవ్వట్లేదని రైతులు తెలిపారు.
హనుమకొండ జిల్లా శాయంపేటలో ఎంఏవో గంగాజమునకు రైతుల నిరసన సెగ తగిలింది. రైతులు ఆమెను చుట్టుముట్టి, యూరియా ఎందుకు ఇవ్వడంలేదని నిలదీశారు.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ పీఏసీఎస్ వద్దకు 250 మంది రైతులు తరలివచ్చారు. గంటల తరబడి వర్షంలోనే బారులుదీరారు. అయినా చాలామందికి యూరియా అందలేదు.
కరీంనగర్ జిల్లా కొలిమికుంట పీఏసీఎస్ వద్ద యూరియా లోడ్ దింపారు. ఓ బస్తా నుంచి కొద్దిగా యూరియా అక్కడ పడింది. ఆ యూరియాను రైతు లక్ష్మి కవర్లో ఎత్తుకున్నది.
నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట వద్ద అక్రమంగా ఏపీకి తరలిస్తుండగా తనిఖీల్లో పట్టుకున్న యూరియా బస్తాలతో వ్యవసాయ అధికారులు
కొత్తగూడెం జిల్లా గానుగపాడు సొసైటీ వద్ద రైతులు ధర్నా చేశారు. యూరియా ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం, అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో యూరియా కోసం రైతులు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సరిపడా యూరియా వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా కల్లూరిగూడెం సొసైటీ వద్దకు యూరియా బస్తాల కోసం రైతులు బుధవారం తెల్లవారు జాము నుంచే భారీగా చేరుకొని బారులుదీరారు. అధికారులు రెండు రోజుల కోసం టోకెన్లు ఇచ్చారు.
మహబూబాబాద్ జిల్లా గొల్లచర్ల సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం రాస్తారోకో నిర్వహించారు. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ సర్కారుతోనే కష్టాలు వచ్చాయని మండిపడ్డారు.
భూపాలపల్లి జిల్లా చిట్యాలలో రైతులతో కలిసి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లే యూరియా కొరత ఏర్పడిందని చెప్పారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలో యూరియా అందని రైతులు ఆగ్రహంతో రాస్తారోకో
నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ
రైతులు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో యూరియా కష్టాలు
లేవని గుర్తు చేసుకున్నారు.
కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్లో యూరియా కోసం రైతులు ధర్నా చేశారు. అదును దాటితే పంటలు దెబ్బ తింటున్నాయని వ్యక్తంచేశారు. రాజంపేట సొసైటీ వద్ద గంటల తరబడి నిల్చుని అలిసిపోయి, చెప్పులు లైన్లో పెట్టి, పడిగాపులు కాస్తున్న రైతులు
మహబూబాబాద్ జిల్లా మరిపెడలో రైతులు పీఏసీఎస్‌లోకి వెళ్లి, 86 యూరియా బస్తాలు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేశారు. రైతులు గేట్లు దూకి లోపలికి పరుగులు తీశారు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో యూరియా దొరకడం లేదంటూ రైతులు ధర్నాకు దిగారు. ఆందోళనకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ దోమకొండ అనిల్‌ను చెన్నూర్ సీఐ దేవేందర్ లాక్కెళ్లారు. పోలీసుల తీరుపై రైతులు మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి రాజా రమేశ్ మాట్లాడుతూ రైతులకు అండగా నిలుస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడటం దారుణమని మండిపడ్డారు. యూరియా కోసం పోరాటం ఆగదని చెప్పారు. బీఆర్ఎస్ ధర్నాతో పోలీసులు అనిల్‌ను వదిలిపెట్టారు.