నేరడిగొండ : పత్తి కొనుగోలులో( Cotton Procurement ) సీసీఐ అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్- నాగపూర్ జాతీయ రహదారి( National Highway) 44 బైటాయించిన నిరసన తెలిపారు. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలకు రూ.8,110 తో పత్తిని కొనుగోలు చేయాల్సిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తేమ ఎక్కువగా ఉందంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 శాతం తేమ ఉంటేనే మద్దతు ధర చెల్లిస్తుందని అన్నారు. జిల్లాలో వర్షాలతో పాటు మంచు పడుతున్నందున పంటలో తేమ ఎక్కువగా ఉంటుందని, తేమ విషయంలో సడలింపు ఇవ్వాలని సీసీఐ అధికారులను కోరిన పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తంచేశారు.
కపాస్ కిసాన్ యాప్ ద్వారా పంట కొనుగోలును చేస్తున్న సీసీఐ మొదట ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేసి ప్రస్తుతం ఏడు క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేస్తుందని ఆరోపించారు. మిగతా పంటను రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించి నష్టపోతున్నట్లు రైతులు తెలిపారు.
తేమతో సంబంధం లేకుండా పత్తి కొనుగోలును జరపాలని , ఎకరాకు ఏడు క్వింటాలు బదులు 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.