కాటారం, ఏప్రిల్ 25 : ఆరుగాలం కష్టపడి వేసిన పత్తి పంట చేతికి అందక… చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో గడ్డిమందు తాగి పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లారంలో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కాటారం మండలం గుండ్రాత్పల్లి గ్రామ పంచాయతీ పరిధి మల్లారం గ్రామానికి చెందిన దుర్గం రాజయ్య(55) తనకున్న నాలుగు ఎకరాల్లో పత్తి, వరి పంట సాగు చేశాడు.
పత్తి పంట దిగుబడి రాక రూ.1.20 లక్షల అప్పులయ్యాయి. వరి పంట కూడా ఆశించిన స్థాయిలో దిగుబడి లేకపోవడంతో పక్షం రోజులుగా దిగులుతో ఉంటున్నాడు. మనస్తాపంతో గురువారం మద్యం తాగిన రాజయ్య అనంతరం గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు 108 వాహనంలో మహదేవపూర్ దవాఖానకు తరలించారు. అక్కడ నుంచి భూపాలపల్లికి, అనంతరం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్సపొందుతూ రాజయ్య శుక్రవారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.