Cotton | హైదరాబాద్ : ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట దెబ్బతినడంతో.. అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అరకొర మిగిలిన పంటను అమ్ముకుందామంటే కూడా గిట్టుబాటు ధర లేక విలవిలలాడిపోతున్నారు. పత్తి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో.. ఓ అన్నదాత తన ఇంటి వద్దే పత్తిని ఆరబెట్టాడు. దురదృష్టావశాత్తు ఆ పత్తి పంట అగ్నికీలలకు కాలి బూడిదైంది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం రామచంద్రు తండాలో చోటు చేసుకుంది.
రామచంద్రు తండాకు చెందిన రైతు బాదావత్ శంకర్ తన పొలంలో వేసిన పత్తిని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటి ముందు ఆరబెట్టగా.. షార్ట్ సర్క్యూట్‌తో ఆ పత్తికి మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే పత్తి అంతా కాలి బూడిదైంది. పత్తికి కాపలాగా ఉన్న ఓ మహిళ గట్టిగా కేకలు వేయగా ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలను ఆర్పేందుకు యత్నించారు. కానీ అప్పటికే పత్తి పూర్తిగా దగ్ధమైంది.
ఈ ఘటన బుధవారం నాడు ఉదయం 11.11 గంటలకు జరిగింది. రైతు ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో అగ్నిప్రమాద దృశ్యాలు రికార్డు అయ్యాయి. మొత్తం రూ. 3 లక్షల నష్టం జరిగిందని రైతు శంకర్ పేర్కొన్నాడు. రూ.3 లక్షలు విలువ చేసే పంట పూర్తిగా కాలిపోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేశాడు.
కంటతడి తెప్పించే దృశ్యాలు
కళ్ల ముందే పత్తి పంట కాలిపోవడంతో కన్నీరు పెట్టుకున్న రైతు కుటుంబం
షాట్ సర్క్యూట్‌తో రూ.3 లక్షల పత్తి పంట దగ్ధం
మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం రామచంద్రు తండాలో షాట్ సర్క్యూట్‌తో రైతు బాదావత్ శంకర్‌కు చెందిన పత్తి పంట దగ్దం
రూ.3 లక్షలు విలువ… pic.twitter.com/19fvqyy4C2
— Telugu Scribe (@TeluguScribe) November 13, 2025