Devanur Forest | వరంగల్, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న దేవునూరు ఇనుపరాతి గుట్ట అడవుల అభివృద్ధిని పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం దాని ఆక్రమణల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. జీవ వైవిధ్య సంపదతో నిండి ఉన్న దేవునూరు అటవీ ప్రాంతంతో ఏడాదిన్నరగా కబ్జాలు పెరుగుతున్నాయి. కబ్జాలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ శాఖ చోద్యం చూస్తున్నది. రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడి ఈ ప్రాంతంతో సంబంధం లేని కొందరికి ఇక్కడ భూములు ఉన్నట్టుగా రికార్డుల్లో నమోదు చేశారనే ఆరోపణలు ఉ న్నాయి. దేవునూరు అటవీప్రాంతంతో కాదు కదా ఉమ్మడి వరంగల్ జిల్లాతోనూ సంబంధం లేని వారికి సైతం ఇక్కడ భారీ విస్తీర్ణంలో ఫాంహౌస్‌లు ఉండటం అనుమానాలకు కారణమవుతున్నది. గతంలో ఈ ప్రాంతంలో పని చేసిన అధికారులకు, ప్రభుత్వ అధికారులతో సన్నిహితంగా ఉన్న వ్యాపారులకు 20 నుంచి 30 ఎకరాల చొప్పున భూములు ఉన్నాయి.
వీటిని స్థానికుల నుంచి కొనుగోలు చేసినట్టు వీరు చెప్పుకొంటున్నారు. 1967 నుంచి పూర్తి అడవిగా ఉన్న దేవునూరు ఇనుపరాతి గుట్ట ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్‌గా కొనసాగుతున్నది. ప్రభుత్వం ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయకపోయినా ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల పరిధిలోని 3,950 ఎకరాలు ఈ ప్రాంతం అడవిగానే ఉంటున్నది. ఇప్పుడు రెవెన్యూ శాఖ అధికారులు అడవిని ధ్వంసం చేసి కొందరికి అప్పగించేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటం విమర్శ ల కు తావిస్తున్నది. రెవెన్యూ, ల్యాండ్ సర్వే, అటవీ శాఖల సంయుక్త సర్వే తుది నివేదికపై అటవీ శాఖ రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలు రాకముందే కొందరికి అటవీ భూములను అప్పగించాలని హనుమకొండ కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంపై విమర్శలు పెరుగుతున్నాయి. స్థానికం గా ఉన్న రైతుల పేర్లతో ఉన్న భూములను నిబంధనల ప్రకారం వారికి అప్పగించాలని, అటవీ భూములను వా రి భూములుగా రెవెన్యూ శాఖ అధికారులు చెప్తుండటం సరికాదని అటవీశాఖ అధికారులు స్పష్టంచేస్తున్నారు.
దగ్గరుండి చెట్ల నరికివేత
పర్యావరణ పరిరక్షణ కోసం కొన్ని ప్రత్యేక చట్టాలు, నిబంధనలు ఉన్నాయి. వీటి అమలులో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ప్రైవేటు వ్యక్తులు సొంత జాగాల్లోని చెట్లను నరికితే రెవెన్యూ శాఖ కేసులు నమోదు చేస్తుంది. సొంత స్థలంలోనే అయినా అనుమతి లేకుండా కొన్ని జాతుల చెట్లను నరికితే తీవ్రమైన నేరంగా కేసులు పెడుతుంటుంది. అటవీ శాఖ పరిధిలోని దేవునూరు ఇనుపరాతి గుట్ట అడవుల్లో కొందరు బుల్డోజర్లను పెట్టి ధ్వంసం చేస్తుంటే రెవెన్యూ, పోలీసు శాఖలు పట్టించుకోవడంలేదు. పైగా అడవిని ధ్వంసం చేస్తున్న వారికి మద్దతుగా అటవీ శాఖ అధికారులను అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. అధికార పార్టీలోని పలుకుబడి ఉన్న ప్రజాప్రతినిధుల ఆదేశాలతో రెవెన్యూ, పోలీసు అధికారులు అనుసరిస్తున్న ఇలాంటి చర్యల వల్ల పర్యావరణ విధ్వంసం జరుగుతున్నది.
గతంలో ఈ ప్రాంతంలో పని చేసిన ఓ పోలీసు ఉన్నతాధికారి ఇక్కడ 25 ఎకరాల్లో ఫాంహౌస్‌ను ఏర్పాటు చేసుకున్నారని స్థా నికులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతానికి చెందిన ఈయనకు దేవునూరు ఇనుపరాతి గుట్ట ప్రాం తంలో ఇంత భారీగా భూములు ఉండటంపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సం బంధం లేని ఓ బియ్యం వ్యాపారి కుటుంబానికి ఇక్కడ పెద్ద విస్తీర్ణంలో భూములు ఉన్నాయని, ఈ ప్రాంతంలో సంబంధం లేకున్నా వీరికి ఈ భూములు ఎలా వచ్చాయో ఎవరికీ అర్థం కావడంలేదని అంటున్నారు.
మొదటి నుంచీ అడవులే!
హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో 3,950 ఎకరాల విస్తరించిన దేవునూరు ఇనుపరాతి గుట్ట అటవీ ప్రాంతం 1927లోనే రిజర్వ్ ఫారెస్ట్ హద్దు రాళ్లు వేసి ఉన్నది. 1967లో రిజర్వ్ ఫారెస్టు భూమిగా ప్రకటించాలని అటవీ శాఖ ప్రతిపాదించింది. అధికారికంగా రిజర్వు ఫారెస్టు అని ఆదేశాలు లేకున్నా ఈ ప్రాంతం అప్పటి నుంచి అటవీ శాఖ పరిధిలోనే ఉంటున్నది. అడవుల పరిరక్షణ కోసం అటవీ శాఖ పరంగా ప్రత్యేకంగా అధికారులు, సిబ్బందిని నియమించింది. 2014 తర్వాత ఈ ప్రాంతంలోని 125 ఎకరాల్లో కొత్తగా లక్షల మొక్కలను నాటి అడవిని అభివృద్ధి చేశారు. రెవెన్యూ అధికారులే చెట్లను నరికించడం విమర్శలకు తావిస్తున్నది.