హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : వైద్యారోగ్యశాఖలో అవినీతి దందా రాజ్యమేలుతున్నది. టీచింగ్ దవాఖానల్లో రోగులకు అందించే భోజనానికి సంబంధించి ఇన్చార్జి డైటీషియన్ల నుంచి అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజూ రూ.7,500 చొప్పున నెలకు రూ 2లక్షలకు పైగా వసూలు చేస్తున్నట్టు సమాచారం. అందుకే రెగ్యులర్ డైటీషీయన్ పోస్టులు భర్తీచేయకుండా కాలయాపన చేస్తున్నారని తెలిసింది. రాష్ట్రంలో 42 డైటీషియన్ పోస్టులు ఖాళీగా ఉండగా, వీటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వీటి భర్తీకోసం 53 మంది అర్హుల జాబితాను ఈ ఏడాది మేలోనే సిద్ధం చేసినప్పటికీ అధికారులు వసూళ్ల మత్తులో పదోన్నతులు ఆలస్యం చేస్తుండటం గమనార్హం.
డీఎంఈ కార్యాలయంలో 8 ఏండ్లుగా ఒకే సెక్షన్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళాధికారి ఈ వసూళ్లలో అన్నీతానై చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. సదరు అధికారిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా చర్యలు చేపట్టకపోడం అనుమానాలకు తావిస్తున్నది. వైద్యారోగ్యశాఖలో పనిచేసే ఆమె భర్త తెరవెనుక ఉండి ఈ వసూళ్ల పర్వాన్ని చక్కబెడుతున్నట్టు తెలిసింది.
అతనిపై ఇటీవల లైంగిక ఆరోపణలు రాగా, ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసింది. అనంతరం పెద్దఎత్తున పైరవీలు చేసి తిరిగి అదే కార్యాలయానికి పోస్టింగ్‌పై వచ్చినట్టు సమాచారం. ఇక డైటీషియన్ల పోస్టుల కోసం పదోన్నతులు చేపట్టకుండా సదరు మహిళాధికారి ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నట్టు తెలిసింది. ఆమె సెక్షన్ మార్చాలని పదోన్నతులు ఆశిస్తున్న ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చొరవచూపి డైటీషియన్ల పదోన్నతులు చేపట్టాలని కోరుతున్నారు.