TSPCB | హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు (టీఎస్‌పీసీబీ)లో అధికారుల ఇష్టారాజ్యం పెరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డుకు శాశ్వత మెంబర్ సెక్రటరీ లేకపోవడంతో ఉద్యోగులు, సిబ్బందిపై నియంత్రణ లోపించిందనే ప్రచారం జరుగుతున్నది. ఉద్యోగుల నియామకానికి స్పష్టమైన సర్వీస్ రూల్స్ లేక అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటంతో బోర్డు లక్ష్యం దెబ్బతింటుందని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సర్వీస్ రూల్స్ విషయంలో ఇప్పటికే శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల మధ్య వివాదం కొనసాగుతున్నది. తాజాగా బోర్డులో టాస్క్‌ఫోర్స్ హెడ్‌గా వ్యవహరిస్తున్న ఒక సీనియర్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్, మరో ఉన్నతాధికారి వ్యవహారాలు అభ్యంతరాలకు దారితీస్తున్నాయి.
సీనియర్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ తన మేనల్లుడిని మూడేండ్ల క్రితం వరంగల్ రీజినల్ సెంటర్లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పించారు. మూడు నెలల్లో ముగియాల్సి ఉండగా, అతను మూడేండ్లుగా అక్కడే అదే ఇంటర్న్‌షిప్ పేరుతో కొనసాగించడం వివాదాస్పదం అవుతున్నది. బీహెచ్ఈఎల్ లాంటి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసిన వారికి ఇతర కంపెనీల్లో ఉద్యోగం పొందడానికి ఉపయోగపడుతుంది. కానీ సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థికి పీసీబీలో పొందిన ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్ ఏ విధంగా పనికివస్తుందనే విషయంలో స్పష్టత లేదు. ఒకవైపు ఆ అధికారి తన మేనల్లుడిని నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తుండగా, నెలకు రూ.25 వేల చొప్పున ఫెలోషిప్ చెల్లించడమూ చర్చనీయాంశంగా మారింది. తనిఖీల పేరుతో తన మేనల్లుడిని కంపెనీలకు స్వయంగా పంపించడం, అతను చేసిన తనిఖీలను తన పేరిట రికార్డులు రూపొందిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.
బోర్డు ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ విభాగం హైదరాబాద్ కార్యాలయంలో ఓ ఉన్నతస్థాయి అధికారి భార్య ఎన్విరాన్మెంట్లో పనిచేస్తున్నారు. ఆమె రోజువారీగా విధులకు హాజరుకావడం లేదని విమర్శలున్నాయి. వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి కార్యాలయానికి వచ్చి సంతకాలు మాత్రమే చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈమె చాలా ఏండ్లుగా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతున్నది. ఇటీవల అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాన్ని సందర్శించినప్పుడు ఈ విషయాన్ని గుర్తించినట్టు తెలిసింది. ఆయా విషయాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వస్తున్నది.