హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేసి తీరాల్సిందేనని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ నెల 18న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
మంత్రివర్గ సమావేశంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పెండింగ్‌లో ఉన్న అంశాలు, ఏపీతో పీటముడిగా ఉన్న అంశాలు, రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే వానకాలం సీజన్‌కు పంటల ప్రణాళిక తదిరత అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సచివాలయంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లతోపాటు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు ఉన్న వివిధ మార్గాలపై చర్చించారు. రూ.2 లక్షల రుణమాఫీకి విధి విధానాలు, ప్రణాళికలు రూపొందించాలని, మహారాష్ట్ర, రాజస్థాన్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు.
అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి రుణమాఫీకి అవసరమైన నిధులను సర్దుబాటు చేయాలని, భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు. వానకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, అక్రమాలకు పాల్పడే రైస్మిల్లర్లపై ఉకుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారు.
విభజన అంశాలపై నివేదిక ఇవ్వండి
జూన్ 2వ తేదీకి రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రెండు రాష్ర్టాల మధ్య ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను రేవంత్‌రెడ్డి ఆదేశించారు. షెడ్యూలు 9, షెడ్యూలు 10లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదని, విద్యుత్తు సంస్థల బకాయిలు ఇంకా తేలలేదని, పలు అంశాలపై రెండు రాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని అధికారులు వివరించారు.
ఆయా అంశాలపై ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిషరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీలు వంటి అంశాలు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. పదేండ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత ఆధీనంలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.