హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని లక్షలాది మంది కార్మికుల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ‘ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్’ (ఐఎంఎస్) ఉద్యోగులపై ‘కార్పొరేషన్’ కత్తి వేలాడుతున్నది. రాష్ట్ర కార్మిక శాఖ పరిధిలో ఉన్న ఐఎంఎస్‌లో ప్రస్తుతం 2,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఐఎంఎస్ కింద ఉన్న నాలుగు దవాఖానలు, రెండు డయాగ్నొస్టిక్ సెంటర్లు, 73 డిస్పెన్సరీలు ఉండగా.. గుర్తింపు పొందిన కార్మికులు, వారి కుటుంబాలు, 19.5 లక్షల ఈఎస్ఐ కార్డుదారులు, మొత్తంగా 70 లక్షల మందికి వీరు సేవలందిస్తున్నారు. అయితే, ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఐఎంఎస్ను కార్పొరేషన్‌గా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర కార్మిక శాఖల అధికారులు ఢిల్లీలో గురువారం సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌గా మార్చుతూ త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఐఎంఎస్ను కార్పొరేషన్‌గా మారిస్తే తమకు అభ్యంతరం లేదని కానీ, ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగించడంపై స్పష్టత ఇవ్వడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా నియామకమై, దశాబ్దాలుగా కొనసాగుతున్న తమను కార్పొరేషన్ ఉద్యోగులుగా మారిస్తే ఉద్యోగ భద్రత ఉండదని, రిటైర్మెంట్ ప్రయోజనాలు దక్కవని ఆవేదన చెందుతున్నారు. తమను కార్మిక శాఖ లేదా వైద్యారోగ్య శాఖ పరిధిలోకి తీసుకోవాలని, ఆ తర్వాత డిప్యూటేషన్‌పై కార్పొరేషన్లో కొనసాగించాలని పేర్కొంటున్నారు. మహారాష్ట్ర తదితర మూడు రాష్ర్టాల్లో ఉద్యోగులను ఇతర శాఖల్లోకి తీసుకొని, డిప్యూటేషన్‌పై కార్పొరేషన్లో కొనసాగిస్తున్నారని పేర్కొంటున్నారు. అదే తరహాలో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.