ఖమ్మం, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రెండేండ్ల తర్వాత శ్రీసీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కొవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేండ్లుగా ఆంతరంగికంగా నిర్వహించిన జానకీరాముల కల్యాణాన్ని ఈసారి భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో భక్తుల సమక్షంలోనే ఘనంగా నిర్వహించారు. రాములోరి పెండ్లిని కండ్లారా చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు భద్రాచలానికి తరలివచ్చారు. కల్యాణం సందర్భంగా స్వామి, అమ్మవార్లకు మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్ పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పట్టువస్ర్తాలు అందజేశారు. జగదభిరాముడు, సీతమ్మవారి కల్యాణాన్ని చూసిన భక్తజనం తన్మయత్వం చెందింది.
భక్తుల కోలాహలం మధ్య వేడుక
ఆదివారం తెల్లవారుజామున అర్చకులు స్వామివారికి సుప్రభాతసేవ నిర్వహించారు. అనంతరం నివేదన, షాత్తుము రై, మూలవరులకు అభిషేకం చేశారు. మంగళాశాసనాలు పఠించారు. భక్తుల కోలాహలం నడుమ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. కల్యాణ పీఠంపై ఉత్సవమూర్తులను ప్రతిష్ఠింపజేసి.. రామయ్య గుణగణాలు, సీతమ్మ అణకువ, అందచందాలను వర్ణించారు. భక్త రామదాసు సీతారాముల కోసం చేయించిన ఆభరణాలు, ఆలయ క్షేత్రప్రాశస్త్యం, కల్యాణ మహోత్సవ విశిష్ఠతను భక్తులకు వివరించారు. భక్తుల హర్షధ్వానాల మధ్య 12 గంటలకు అభిజిత్ ముహూర్తాన అర్చకులు సీతారాముల శిరస్సులపై జీలకర్ర బెల్లం ఉంచారు. సీతమ్మ మాంగల్యధారణ ఘట్టాన్ని చూసి భక్తులు తరించారు. వేడుకలో హైకోర్టు న్యాయ మూర్తులు జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ సుధీర్‌కుమార్, జస్టిస్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ మధుసూదన్, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు వీపీ గౌతమ్, దురిశెట్టి అనుదీప్, భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్, ఎస్పీ సునీల్‌దత్, ఆలయ ఈవో శివాజీ పాల్గొన్నారు.
పర్ణశాలలో..
భద్రాచలానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనుబంధ ఆలయం పర్ణశాల శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలోనూ కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కల్యాణాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో పర్ణశాల ఆలయ పరిసర ప్రాంతాలు, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భక్తుల సందడి కనిపించింది.
నేడు శ్రీరామ మహాపట్టాభిషేకం..
భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో సోమవారం శ్రీరాముడి మహాపట్టాభిషేకం జరుగనున్నది. ఆలయ అర్చకులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వేడుక నిర్వహించనున్నారు. పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ తమిళిసై హాజరుకానున్నారు. స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు.
మతాలకతీతంగా రామయ్య కల్యాణం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని మతాలకతీతంగా నిర్వహించారు. వాడపల్లి జకరయ్య (క్రైస్తవుడు) తన ఇంటి నుంచి శ్రీ సీతారాముల విగ్రహాలను మేళతాళాలతో ఎదుర్కోలు చేసి కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. మహబూబ్ షా (ముస్లిం) స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
– చుంచుపల్లి