శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 17, 2020 , 15:13:32

భక్తులు లేకుండానే భద్రాద్రిలో శ్రీరామనవమి

భక్తులు లేకుండానే భద్రాద్రిలో శ్రీరామనవమి

భద్రాద్రి కొత్తగూడెం : భక్తుల శ్రీరామ నామస్మరణల మధ్య జరిగే శ్రీరామనవమి వేడుకలపై కరోనా ప్రభావం పడింది. ఏప్రిల్‌ 2న భద్రాద్రిలో జరిగే శ్రీరామనవమి వేడుకలను భక్తులు లేకుండానే నిర్వహించాలని నిర్ణయించినట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ తెలిపారు. ఈ వేడుకలకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నారు. భద్రాద్రి కల్యాణం కోసం ఆన్‌లైన్‌లో విక్రయించిన టికెట్లను రద్దు చేస్తున్నామని మంత్రి చెప్పారు. భక్తులకు టికెట్‌ డబ్బు తిరిగి ఆలయ అధికారులు చెల్లిస్తారని ఆయన స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా కేవలం ఆలయ ప్రాంగణంలోనే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు.

శ్రీరామనవమి వేడుకలకు సిద్ధం చేసిన 18 వేల టికెట్లలో కేవలం 1090 మాత్రమే విక్రయించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మిథిలా స్టేడియంలో జరుగుతున్న పనులను నిలిపివేశామన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తులెవరూ శ్రీరామనవమి వేడుకలకు రావొద్దని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. రాములోరి కల్యాణానికి అధికారులు, అర్చకులు మాత్రమే హాజరవుతారు. 

రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దు. అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అని మంత్రి పువ్వాడ అజయ్‌ చెప్పారు. 


logo