హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కనీస హాజరు శాతం నుంచి విద్యార్థులకు జేఎన్టీయూ మినహాయింపు ఇచ్చింది. హాజరుతో పనిలేకుండా జూలైలో నిర్వహించే బీటెక్, ఎంటెక్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ సెమిస్టర్ పరీక్షలకు విద్యార్థులను అనుమతించనున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ వెల్లడించారు. గతంలో ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులకు కనీసం 75 శాతం హాజరు తప్పనిసరి. ఒకవేళ 65 శాతం హాజరు ఉంటే మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా 10 శాతం కలిపి పరీక్షలకు అనుమతించేవారు. కరోనా నేపథ్యంలో నిరుడు కనీస హాజరు శాతం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ విద్యాసంవత్సరం కూడా అమలు చేసుకున్నారు. సెమిస్టర్ పరీక్షల్లో చాయిస్ ప్రశ్నలను సైతం కొనసాగించనున్నట్టు జేఎన్టీయూ ప్రకటించింది. తాజా విధానంలో 8 ప్రశ్నలకుగాను విద్యార్థులు ఏదేని ఐదు ప్రశ్నలు రాస్తే సరిపోతుందని తెలిసింది. కొవిడ్ మార్గదర్శకాలు అనుసరించే పరీక్షలు జరుగుతాయి.