హైదరాబాద్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ మాట ఇచ్చారంటే.. చేసి తీరుతారని, వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదని, రుణమాఫీపై ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్ లోపు మొత్తం రుణమాఫీ చేయాలని నిర్ణయించారని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఎప్పుడో రుణమాఫీ పూర్తయ్యేదని, కరోనా, కేంద్ర సర్కారు కక్ష సాధింపు కారణంగా కాస్త ఆలస్యమైందని తెలిపారు.
సెప్టెంబర్ రెండో వారంలోపు రూ.లక్ష వరకు రుణాలన్నీ మాఫీ చేస్తామని వెల్లడించారు. ఏ రాష్ట్రమూ చేయని విధంగా రైతులకు మేలు చేస్తున్నామని చెప్పారు. రుణమాఫీపై సీఎం కేసీఆర్కు రైతాంగం తరపున ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చాలా చెప్తున్నదని, అందులో ఒక్కటి కూడా చేయదని విమర్శించారు. ఇక్కడ మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినా.. ప్రజలు ఆ పార్టీని విశ్వసించలేదని పేర్కొన్నారు.