కరీంనగర్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకార వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని, సహకార వ్యవస్థలో రాజకీయ జో క్యం ఉండదని స్పష్టం చేశారని కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, టెస్కాబ్, నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు గుర్తుచేశారు. శనివారం కరీంనగర్లో సహకార సంఘాలు, బ్యాంకు ఉద్యోగులు ఆయనకు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రవీందర్రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడే నాటికి రూ.1,600 కోట్లు ఉన్న సహకార బ్యాంకుల వ్యాపారం ఇప్పుడు రూ.40 వేల కోట్లకు ఎదిగిందని తెలిపారు. 2005లో కరీంనగర్ సహకార బ్యాంకు అధ్యక్షుడిగా ఎన్నికైనపుడు కరీంనగర్ బ్యాంక్ మూసివేసే దిశలో ఉందని చెప్పా రు. ఇప్పుడు రూ.400 కోట్ల వ్యాపారం నుంచి రూ.8,100 కోట్ల వ్యాపారం చేసే స్థాయికి ఎదిగిందని, రూ.990 కోట్ల డిపాజిట్లు సేకరించగలిగామని చెప్పారు.
సహకార ఎన్నికలు నిర్వహించాలి : ఈటల రాజేందర్
సహకార ఎన్నికలు వెంటనే నిర్వహించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. సహకార సంఘాలకు, పార్టీ రాజకీయాలకు సంబంధాలు ఉండవని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అందుబాటులో ఉండే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ సహకార సంఘాలేనని చెప్పారు. ఇలాంటి సంఘాలకు పాలకవర్గాలు ఉండాలని పేర్కొన్నారు.
పూర్తి స్థాయిలో సేవలందించాలి : మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
సహకార సంఘాల ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో సేవలు అందించాలని మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సూచించారు. రైతులకు పంట రుణాలపై 7 శాతం వడ్డీలో కేంద్ర ప్రభుత్వం నుంచి 3 శాతం వస్తున్నదని, రాష్ట్రం చెల్లించాల్సిన 4 శాతం వడ్డీ రాయితీ రావడం లేదని ఆరోపించారు. దీర్ఘకాలిక, మధ్యకాలిక రుణాలపై 6 శాతం వడ్డీ రాయితీ కూడా రావడం లేదని, అసైన్డ్ భూములపైనా బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం లేదని వాపోయారు.