హైదరాబాద్, రామగిరి మే 18 (నమస్తే తెలంగాణ) : టీఎస్ ఎడ్‌సెట్ గురువారం సజావుగా ముగిసినట్టు కన్వీనర్ ఏ రామకృష్ణ తెలిపారు. రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి ఈ పరీక్షను మూడు సెషన్లలో నిర్వహించినట్టు పేర్కొన్నారు. పరీక్షకు 31,725 దరఖాస్తులు రాగా, 27,495 (86.6%) మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 49 కేంద్రాల్లో ఆన్లైన్లో పరీక్ష జరిగిందని పేర్కొన్నారు. ముందుగా, నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సెట్ నిర్వహణ ఏర్పాట్లను కమాండ్ కంట్రోల్ ద్వారా పరిశీలించిన అధికారులు ప్రశ్నపత్రాల కోడ్లను విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, ఎడ్‌సెట్ చైర్మన్ సీహెచ్ గోపాల్‌రెడ్డి, ఇతర అధికారులు పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించారు.