Sthree Nidhi Recruitment | హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ‘స్త్రీనిధి’ సంస్థలో ఉద్యోగ నియామకాల కోసం ఇటీవల జారీచేసిన నోటిఫికేషన్ పెను దుమారానికి దారితీస్తున్నది. పారదర్శకత పేరుతో ఆ సంస్థ ఇస్తున్న వివరణలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు పొంతన లేకపోవడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఉన్నతస్థాయి పోస్టులను పరీక్ష లేకుండా కన్సల్టెంట్ల పేరుతో భర్తీ చేయడం వెనుక పెద్దఎత్తున అవినీతికి ఆసారం ఉన్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ నియామకాలపై విచారణ చేపట్టిన స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) పోలీసులు.. సంబంధిత శాఖ అధికారులతోపాటు జర్నలిస్టులను కూడా ఆరాతీశారు. కన్సల్టెంట్ల పేరుతో 20 పోస్టుల భర్తీ వ్యవహారంపై ప్రభుత్వానికి ఎస్బీ నివేదిక అందజేయనున్నట్టు తెలిసింది.
కాగా, ఉద్యోగ నియామక ప్రక్రియపై పర్యవేక్షణ కోసం చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసినట్టు ‘స్త్రీనిధి’ యాజమాన్యం మంగళవారం ఇచ్చిన వివరణలో పేర్కొన్నది. దీంతో ఇంత ఉన్నతస్థాయి కమిటీ పర్యవేక్షణ ఉంటే ఆ విషయాన్ని నోటిఫికేషన్లో ఎందుకు పొందుపరచలేదని పలువురు ప్రశ్నిసున్నారు. కమిటీ సభ్యులుగా ఉన్న ఐటీ, ఫైనాన్స్ సెక్రటరీల అనుమతులు ఉంటే ఆ జీవో నంబర్లను ఎందుకు బహిర్గతం చేయలేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తున్నామని చెప్తున్న స్త్రీనిధి సంస్థ.. నోటిఫికేషన్లో ఏ క్యాటగిరీలకు ఎన్ని పోస్టులు కేటాయించిదీ స్పష్టం చేయకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తున్నది. ఉన్నత స్థాయి పోస్టులకు ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు గతంలో సర్కార్ ప్రకటించినప్పటికీ ఇకడ మళ్లీ ఇంటర్వ్యూలను చొప్పించడం వెనుక ప్రభుత్వ పెద్దల అనుయాయులకు లబ్ధి చేకూర్చే కుట్ర దాగి ఉన్నదన్న విమర్శలకు బలం చేకూరుస్తున్నది.