హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) భూముల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. 50 ఎకరాల యూనివర్సిటీ భూములను రియల్ ఎస్టేట్ మాఫియాకు ధారాదత్తం చేసేందుకు డబుల్‌గేమ్ ఆడుతున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భూములను స్వాధీనం చేసుకొనే యత్నాలకు వ్యతిరేకంగా మనూ విద్యార్థులు ఆందోళన బాట పట్టడంతో మైనారిటీశాఖ మంత్రి అజారుద్దీన్ రంగంలోకి దిగారు. భూములను స్వాధీనం చేసుకోబోమని, కలెక్టర్ నోటీసులు వెనుకకు తీసుకున్నారని ప్రకటించారు. కానీ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.
మనూకు మణికొండ గ్రామంలోని 211, 212 సర్వే నంబర్లకు చెందిన 200 ఎకరాల భూములను కేటాయించారు. అందులో 50 ఎకరాలు ఖాళీగా ఉన్నాయని, 1975 రెవెన్యూ నిబంధనల్లోని నిబంధన 6 ప్రకారం ఆ భూములను ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో చెప్పాలంటూ రంగారెడ్డి కలెక్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు గతంలో నోటీసు జారీచేశారు. దీనికి వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరారు. అనంతరం ఆ భూములను తహసీల్దార్ తనిఖీ కూడా చేశారు. ఆ 50 ఎకరాల భూములను యూనివర్సిటీ భవిష్యత్తు అవసరాలకు వినియోగిస్తామని రిజిస్ట్రార్ తెలిపారు. అందులో స్కూల్ ఆఫ్ సైన్స్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, సోషల్ సైన్సెస్, బాలికలు, బాలల వసతి గృహం, గ్రంథాలయ భవనం, వివాహిత విద్యార్థులకు వసతి గృహం, టైప్-4 క్వార్టర్స్, టైప్-5 క్వార్టర్స్ నిర్మించనున్నట్టు వివరించారు.
మరోవైపు విద్యార్థుల ఆందోళన ఉధృతరూపం దాల్చడంతో రంగంలోకి దిగిన మంత్రి అజారుద్దీన్ ఆ భూములను స్వాధీనం చేసుకోబోమని ఓ మీడియా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదే విషయాన్ని అధికారికంగా ఎందుకు ప్రకటించడం లేదని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మబోమని విద్యార్థులు అంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ భూములను లాక్కొనేందుకు ఏదైనా చేయొచ్చని ఆందోళన చెందుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి తమకు స్పష్టమైన హామీ వచ్చేదాకా యూనివర్సిటీ భూముల పరిరక్షణకు ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. విద్యాభివృద్ధికి కేటాయించిన భూములను రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు కట్టబెట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.