Engineering Counselling | హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇంజినీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలకు బ్రేకులు పడ్డాయి. మంగళవారమే విడుదల కావాల్సిన షెడ్యూల్ నిలిచిపోయింది. ఒకే ఒక్క కారణంతో నిలిపివేసినట్టు సమాచారం. ఎప్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు అంతా సిద్ధంచేశారు. ఈ నెలాఖరు లేదా, జూలై 1 నుంచి కౌన్సెలింగ్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ తరుణంలో చిన్న చిక్కొచ్చిపడింది. ఆ చిక్కుపై అధికారులు ప్రభుత్వం నుంచి స్పష్టత కోరారు.
ప్రభుత్వం సరైన స్పష్టతను ఇవ్వకపోవడంతో కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల నిలిచిపోయింది. రాష్ట్రంలో బీటెక్ సహా ప్రొఫెషనల్ కోర్సుల కన్వీనర్ కోటా ఫీజుల సవరణకు తెలంగాణ అడ్మిషన్-ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఇప్పటికే కసరత్తును పూర్తిచేసింది. ఆ కమిటీ కాలేజీల వారీగా ఫీజులను ఖరారు చేసింది. ఆ ఫీజులను ఆమోదించాల్సిన తరుణంలో ప్రభుత్వం వివిధ కాలేజీల్లో ఫీజులు అసాధారణంగా పెరగడంపై అభ్యంతరాలను వ్యక్తంచేసింది. ఇటీవలే జరిగిన టీఏఎఫ్ఆర్సీ సమావేశంలో ఫీజుల పెంపులేదని, పాత ఫీజులతోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులు ఎప్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సిద్ధంచేశారు.
కౌన్సెలింగ్ షెడ్యూల్‌కు ముందు అధికారులకు ఓ అనుమానం తట్టింది. ఫీజుల పెంపులేదని టీఏఎఫ్ఆర్సీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇదే విషయంపై సర్కారు నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు విడుదల కాలేదు. ఇలా ఉత్తర్వులు లేకుండా ముందుకెళ్తే కాలేజీలు కోర్టుకెళ్తాయని, న్యాయపరమైన చిక్కులు తప్పవన్న అభిప్రాయం వారిఓ వ్యక్తమైంది. ఈ మేరకు ఈ ఏడాదికి పాత ఫీజులే ఉంటాయని ఉత్తర్వులు ఇవ్వాలని సర్కారును అభ్యర్థించారు. అయితే సర్కారు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో షెడ్యూల్ విడుదల వాయిదా పడింది.
బీటెక్‌తోపాటు అన్నిరకాల ప్రొఫెషనల్ కోర్సులకు ఈ ఏడాది పాత ఫీజులను కొనసాగించాలని సర్కారు నిర్ణయించింది. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎం ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మా-డీ, ఆర్కిటెక్చర్, ఫైన్ఆర్ట్స్, బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, యూజీ డీపీఈడీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం వంటి కోర్సుల ఫీజుల సవరణకు కూడా టీఏఎఫ్ఆర్సీ కసరత్తు చేసింది. ఈసారి ఫీజుల పెంపు లేదన్న నిర్ణయం బీటెక్‌తోపాటు అన్ని కోర్సులకూ వర్తిస్తుందని స్పష్టతనిచ్చింది. దీంతో పాత ఫీజుల ప్రకారమే ఆయా కోర్సుల్లోని సీట్లను భర్తీచేస్తారు.