హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): బీజేపీలో కొత్త అధ్యక్షుడి నియామకం విషయంలో ఆ పార్టీలో వివాదం నెలకొన్నది. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు పగ్గాలు అప్పగించొద్దని ఆ పార్టీలో కొందరు సీనియర్లు అధిష్ఠానం వద్ద వాదన వినిపించినట్టు తెలిసింది. తొలుత ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపించినా, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన తర్వాత పరిస్థితిలో మార్పు కనిపిస్తున్నది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విడుదల కాగానే కిషన్‌రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రి పదవి ఖాయమని, ఈటల రాజేందర్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బండి సంజయ్‌కి పార్టీ జాతీయ స్థాయి పదవి కొనసాగుతుందని అంచనా వేశారు. ఈ దశలో ఎవరూ ఊహించని విధంగా బండి సంజయ్‌కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కడంతో అభిప్రాయాల్లో మార్పు కనిపిస్తున్నది.ఆర్ఎస్సెస్,బీజేపీ మూలాలు ఉన్న వ్యక్తులకే ప్రాధాన్యం ఇచ్చిందనే వాదన నెలకొన్నది. ఈ కోణంలో ఈటలకు పదవి అనుమానమే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఈటల పార్టీని నడపలేరని ఆ సీనియర్లు ఢిల్లీ పెద్దలకు చెప్పినట్టు తెలిసింది. గతంలో బండి సంజయ్‌పై ఈటల రాజేందర్ పదే పదే ఫిర్యాదులు చేశారని, చేరికల కమిటీ చైర్మన్‌గా విఫలం అయ్యారని వివరించినట్టు సమాచారం. ఈ క్రమంలో కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ రాం చందర్రావు పేర్లు తెరమీదికి వచ్చాయి. ఇప్పటికే ఈటలతోపాటు రఘునందన్‌రావు, డీకే అరుణ వంటివారి పేర్లు కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవేవీ పట్టించుకోకుండా ఈటల రాజేందర్ తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్టు సమాచారం.