కోరుట్ల, ఫిబ్రవరి 26: రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదం పోవాలంటే మరోసారి నరేంద్రమోదీ ప్రధానిగా ఎన్నికవ్వాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెక్యులరిజం పదాన్ని అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టలేదని, ఇందిరాగాంధీ దొంగతనంగా పెట్టిందని చెప్పారు. ఆ సెక్యులరిజం పోవాలన్నా, నూటికి నూరు శాతం హిందూ దేశం కావాలన్నా మోదీ మళ్లీ ప్రధానిగా ఎన్నిక కావాలని అన్నారు. భారతదేశంలో ఉండి మోదీకి ఓటు వేయని వారు దేశద్రోహులు అని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనే దేశానికి శ్రీరామ రక్ష అని, ప్రపంచ దేశాలు మోదీ నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. బీజేపీ విజయ సంకల్పయాత్రలో భాగంగా సోమవారం జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో ఆయన మాట్లాడారు. కొందరు పెద్ద మాంసం బాగా తిని బీజేపీని ఓడించాలనే కుట్రతో బీఆర్ఎస్కు ఓట్లు వేశారని ఓ వర్గాన్ని కించపరిచే వాఖ్యలు చేశారు. ‘మీరు తినే తిండి ఫ్రీగా ఇస్తున్నది నరేంద్ర మోదీ.. మైనార్టీలకు ఫండింగ్ ఇస్తున్నది మోదీ.. షాదీ ముబారక్ పథకానికి, మైనార్టీ సూల్లో మీ పిల్లలు చదువుకోవడానికి నిధులు సమకూరుస్తున్నది కేంద్ర ప్రభుత్వం’ అంటూ తన అక్కసు వెళ్లగక్కారు. ‘మనం ఒక్క పెళ్లి చేసుకోవాడానికే తంటాలు పడుతున్నాం.. వాళ్లేమో నాలుగు పెళ్లిళ్లు చేసుకొని పదిమందిని కంటున్నారు’ అంటూ వివాదాస్పదంగా మాట్లాడారు. రానున్న తరాలు సురక్షితంగా ఉండాలన్నా, మన పిల్లల్ని కాపాడుకోవాలన్నా, జనాభాను తగ్గించాలన్నా మోదీని గెలిపించుకోవాలని చెప్పుకొచ్చారు. జమ్ముకశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు చేశామని, త్వరలోనే ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని తెస్తామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశంలో మూతపడ్డ 68 చకెర కర్మాగారాలను తెరిపించిందని చెప్పారు. నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకు వచ్చానని, పసుపు మద్దతు ధర రూ.13,700 పలుకుతుండటంతో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు.
కాంగ్రెస్ అబద్ధాల కోరు
కాంగ్రెస్ అంటేనే అబద్ధాలకోరని ‘వాడు గొర్రెలు తిన్నాడని, వీడు బర్రెలు తింటాడు. అంతే తేడా’ అని అరవింద్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అంటేనే కరెంటు కట్ అన్నారు. దేశ భవిష్యత్తు కోసం ఓటేయాలని, తిండిపెట్టిన వారిని మర్చిపోవద్దని సూచించారు. ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తునన్నదని, సీఎం రేవంత్‌రెడ్డి కోట్ల రూపాయల నిధులను తన నియోజకవర్గానికి తరలిస్తున్నారని ఆరోపించారు.