Alagu Varshini | హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) : ‘గురుకులాల్లో చదివే విద్యార్థులతో పనులు చేయించుకుంటాం.. వాళ్లు వాడే టాయిలెట్లను వారే కడుక్కుంటే తప్పేంటి.. వాళ్లేమీ పాష్ సొసైటీ నుంచి వచ్చిన వాళ్లేమీ కాదు.. వాళ్లు కూర్చున్న వెంటనే టేబుల్ మీదికి భోజనం వస్తుందని భావిస్తే కుదరదు. ఇలా టేబుల్‌పై కొడితే క్లీనింగ్‌కు మనుషులు వస్తారంటే కలవదు’ అని రాష్ట్ర ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె మాట్లాడినట్టు ఉన్న ఓ ఆడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. ఈ ఆడియోలో ఆమె మాట్లాడిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గురుకులాల్లో చదివే పిల్లలు ఆర్థిక స్థోమత తక్కువ ఉన్నావాళ్లే అని ఆమె చులకనగా మాట్లాడారు. ఎవరైనా పిల్లలతో పనులు చేయించుకుంటున్నారని బెదిరిస్తే నా ఆర్డర్ అని చెప్పండని అధికారులకు హుకూం జారీచేశారు. విద్యార్థులు చపాతీ చేయాల్సి వస్తే చేయాల్సిందేనని ఆదేశించారు. జమ్మికుంట నుంచి కొందరు విద్యార్థులతో చపాతీ చేయిస్తున్నారని తనకు ఫొటోలు పంపారని, విద్యార్థులు చేస్తే మంచిదే కదా అని వారితో అన్నానని చెప్పారు. పిల్లలతో గదులు శుభ్రం చేయిస్తే మంచిదే కదా అని ఆమె సెలవిచ్చారు. స్వీపర్లు వచ్చి ప్రతిసారీ వచ్చి గదులను ఎలా శుభ్రపరుస్తారని, విద్యార్థులే ఎందుకు తమ గదులను శుభ్రం చేసుకోకూడదని ప్రశ్నించారు.
గురుకులాల్లో చేపట్టే పనులను విద్యార్థులకు ప్రిన్సిపాళ్లు షేర్ చేయాలని ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి ఆదేశించినట్టు ఆ ఆడియోలో ఉన్నది. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి బెదిరిస్తే కుదరదని వార్నింగ్ ఇచ్చారు. తాను స్కూళ్లకు వెళ్లినప్పుడు పిల్లలు కనీసం బూజు కూడా దులపడంలేదని.. వాళ్లు ఎందుకు అలా చేయలేదో తనకు అర్థం కాలేదని పేర్కొన్నారు. విద్యార్థులు పనులు చేసేటప్పుడు ఫొటో తీసి పంపిస్తే తాను భయపడేది లేదని స్పష్టంచేశారు. విద్యార్థులు తప్పకుండా తాము ఉంటున్న వాతావారణాన్ని శుభ్రం చేసుకోవాల్సిందేనని ఆమె తేల్చిచెప్పారు. పిల్లలతో పనులు చేయించే విషయంలో గురుకులాల సిబ్బందిలో ఎలాంటి భయాలొద్దని ఆమె భరోసా ఇచ్చినట్టు ఆ ఆడియోలో ఉన్నది.
గురుకులాల విషయంలో రాజకీయాలు చేయొద్దని ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి కోరారు. ఈ మేరకు ఆమె బుధవారం ఓ ఆడియో ప్రకటన విడుదల చేశారు. ఆధారాలు లేకుండా చేసే ఆరోపణలు సరికాదని తెలిపారు. వారం ముందు జరిగిన సంఘటనకు సంబంధించిన ఆడియోను ఎడిట్ చేసి సర్క్యులేట్ చేయడం ద్వారా ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పారు. విద్యార్థుల సంక్షేమానికి వ్యతిరేకంగా కొందరు కావాలనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) విద్యార్థులకు ఇబ్బంది కలిగించే ఎలాంటి నిర్ణయం తీసుకోదని స్పష్టంచేశారు. విద్యార్థులు వంట చేయాల్సి వస్తే చేయాల్సిందేనని, తాము ఉండే పరిసరాలు, తమ గదులు, వాష్ రూమ్‌లు క్లీన్‌గా ఉంచుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉన్నదని మరోసారి చెప్పారు. ఉన్న సిబ్బందిని పక్కన పెట్టి విద్యార్థులతో ఎలాంటి పనులు చేయించడం లేదని., ఆయా పనుల్లో విద్యార్థుల సేవలను మాత్రమే వాడుకుంటామని చెప్పారు. విద్యార్థులు ఇంట్లో ఉండి ఏమేమి చేసుకుని చదువుకుంటారో అలాంటి వాతావరణమే ఇక్కడ కల్పిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు ఇక్కడి నుంచి బయటకు వెళ్లాక అన్ని విషయాలపై అవగాహన గల పౌరులుగా ఎదగాలనేదే తమ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు.