హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ఓటరు నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) సుదర్శన్‌రెడ్డి రాజకీయ పార్టీలను కోరారు. సోమవారం హైదరాబాద్ బీఆర్కే భవన్లో బీజేపీ, ఎంఐఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, సీపీఐ(ఎం) తదితర రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఎలక్టోరల్ ప్రక్రియకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. ‘స్పెషల్ సమ్మరీ రివిజన్-2025’ ముద్రణ ఈ నెల 6తో ముగిసినట్టు తెలిపారు. ఓటర్ల నమోదు పారదర్శకత కోసం ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అవసరమని చెప్పారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు, కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు వెల్లడించారు. ఓటర్లకు అవగాహన కల్పించే ప్రక్రియలో రాజకీయపార్టీలు చురుగ్గా పాల్గొనాలని కోరారు.