మామిళ్లగూడెం, సెప్టెంబర్ 15 : హైదరాబాద్లో సోమవారం చేపట్టిన ధర్నాకు వెళ్తున్న పలువురు గుత్తేదారులను ఖమ్మం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు వెంటనే నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుత్తేదారులు సోమవారం హైదరాబాద్లో ధర్నా నిర్వహించారు.
ఇందులో పాల్గొనేందుకు బయలుదేరిన కాంట్రాక్టర్లను ఖమ్మం నగరంలో అదుపులోకి తీసుకుని రెండో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. సాయంత్రం వరకు అదుపులో ఉంచుకొని ఆ తరువాత వ్యక్తిగత పూచీకత్తుపై వదిలి పెట్టారు.