బోథ్, అక్టోబర్ 28: ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడిపై కాంట్రాక్టర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. డబ్బుల కోసం ఏకంగా చెట్టుకు కట్టేశాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకున్నది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సొనాల మండలంలోని కోటా(కే) గ్రామానికి చెందిన మారుతికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. సత్యనారాయణ అనే గుత్తేదారు ఇంటిని నిర్మిస్తున్నాడు. ఇటీవల మొదటి విడతగా ఇంటికి సంబంధించి రూ.లక్ష లబ్ధిదారుడి ఖాతాలో జమయ్యాయి. ఇల్లు కట్టిస్తున్న కాంట్రాక్టర్‌కు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. మంగళవారం సదరు కాంట్రాక్టర్‌కు లబ్ధిదారుడు సొనాల బస్టాండ్‌లో కన్పించడంతో పట్టుకొని తాడుతో ఓ చెట్టుకు కట్టేశాడు. ఖాతాలో జమైన డబ్బులు తనకు ఇస్తేనే వదిలిపెడతానని పట్టుబట్టాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లి లబ్ధిదారుడు మారుతిని విడిపించారు. ఆ వెంటనే మారుతితోపాటు కాంట్రాక్టర్ సత్యనారాయణను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నట్టు తెలిసింది.
ఇందిరమ్మ ఇల్లుకు 40వేలు లంచం ; జీపీ కార్యదర్శిపై బాధితురాలి ఫిర్యాదు
శంకరపట్నం, అక్టోబర్ 28: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానంటూ తన వద్ద పంచాయతీ కార్యదర్శి రాజేశ్ రూ.40వేల లంచం తీసుకున్నాడని ఓ బాధితురాలు ఆరోపించింది. పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్‌కు చెందిన నూనె పద్మ మంగళవారం ఎంపీడీవో కృష్ణప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. ఎంపీడీవో వెంటనే స్పందించి హౌసింగ్ ఏఈని విచారణకు ఆదేశించారు. కార్యదర్శిని వివరణ కోరగా.. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా గతంలోనే బేస్మెంట్ నిర్మించిన సదరు మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కొందరు పెద్ద మనుషులు తనను కలిసి ఒత్తిడి చేశారని, వాళ్ల ఒత్తిడికి తలొగ్గక పోవడంతో నిరాధార ఆరోపపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. డబ్బులు తీసుకున్నట్టు రుజువైతే ఎంతటి శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు.