రాజన్న సిరిసిల్ల, మే 20 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన గొల్లెని వెంకటేశ్ కాంట్రాక్టర్ 2021లో మైనార్టీ వెల్ఫేర్ ఫండ్ నిధులు రూ. 4.35 లక్షలతో కబ్రస్థాన్ చుట్టూ ప్రహరీ నిర్మించారు. నాలుగు నెలల క్రితం ఇందుకు సంబంధించిన బిల్లులు మంజూరవడంతో వెంకటేశ్ పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్‌రావును సంప్రదించి ఎంబీ రికార్డు చేయాల్సిందిగా కోరారు. అందుకు ఆయన రూ. 8వేలు డిమాండ్ చేయగా, అంత డబ్బు ఇవ్వలేనని అనడంతో చివరికి రూ. ఏడువేలు ఇవ్వాలని చెప్పాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం కలెక్టరేట్లోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి ఉద్యోగి భాస్కర్‌రావు డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.