కవాడిగూడ, ఏప్రిల్ 16 : రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. వర్సిటీల్లోని కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మధుసూదనాచారి మాట్లాడుతూ.. పాలకవర్గం నిర్లక్ష్యంతోనే కాంట్రాక్ట్ అధ్యాపకులు ధర్నాకు దిగాల్సిన దుస్థితి వచ్చిందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జేఎల్, డీఎల్, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేసిన కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసినట్టు గుర్తుచేశారు. యూనివర్సిటీ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలనుకునే సమయానికి ఎన్నికలు రావడంతో చేయలేకపోయామని తెలిపారు. వీరిని రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందన్నారు. సమస్య పరిష్కారమయ్యేం త వరకు బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని చెప్పారు.
రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ య్య మాట్లాడుతూ.. యూజీసీ నిబంధనలను సవరించి కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని పార్లమెంట్లో కోరనున్నట్టు చెప్పారు. ఆచార్య హరగోపాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు యూనివర్సిటీలను ధ్వంసం చేస్తున్నాయని, అది కరెక్ట్ కాదని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని ఎమ్మెల్యే కూనంనేని కోరారు. కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసేందుకు యూజీసీ నిబంధనలు సడలించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరనున్నట్టు ఎమ్మెల్సీ అంజిరెడ్డి తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. మహాధర్నాలో జేఏసీ నాయకులు విజయేందర్‌రెడ్డి, ధర్మతేజ, పరశురాం, వేల్పుల కుమార్, ఉపేందర్, తాళ్లపల్లి వెంకటేశ్, చిర్ర రాజు, శ్రీధర్‌రెడ్డి, సురేశ్‌నాయక్, దత్తహరి, నారాయణగుప్తా, శివారెడ్డి, కరుణాకర్, రేష్మారెడ్డి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.