హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ఒకరోజు జీతం ఆలస్యమైతేనే కంగారుపడే రోజులివి. రోజువారీ ఖర్చులు, ఈఎంఐలు, స్కూలు ఫీజులు, బస్సుచార్జీలు, ఇంటికిరాయిలు ఇలా రకరకాల సమస్యలు ఎదురవుతాయి. అలాంటిది రాష్ట్రంలోని 2008 -డీఎస్సీ కాంట్రాక్ట్ టీచర్లు నాలుగు నెలలుగా జీతాలు చేతికందక ఆకలికేకలతో ఆలమటిస్తున్నారు. బతుకమ్మ అయిపోయింది.. దసరా పండుగ పోయింది. ఇక దీపావళికైనా చేతికందుతాయా..? లేదా? అన్న ప్రశ్నలు పీడిస్తున్నాయి.విద్యాశాఖలో పనిచేస్తున్న 1225 మంది కాంట్రాక్ట్ టీచర్లు వేతనం అందక అవస్థలు పడుతున్నా రీ ఎంగేజ్మెంట్ ఆర్డర్ ఇవ్వడంలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా.. ఉపాధ్యాయులు నాలుగు నెలలుగా పస్తులు ఉండాల్సి వస్తున్నది. కొన్ని జిల్లాల్లో అయితే 8 నెలలుగా ఒక రూపాయి కూడా వేతనం అందని ఉపాధ్యాయులు కూడా ఉన్నారు.
డీఎస్సీ 2008లో నష్టపోయిన అభ్యర్థులకు ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంట్రాక్ట్ ఎస్జీటీలుగా ఉద్యోగం ఇచ్చింది. నెలకు రూ.31,040 వేతనాన్ని ఖరారు చేసింది. అప్పటినుంచి రాష్ట్రవ్యాప్తంగా 1,225 మంది కాంట్రాక్ట్ ఎస్జీటీలుగా విధులు నిర్వహిస్తున్నారు. వారి వేతనాల కోసం ప్రభుత్వం ఆరు నెలల కిందటే బడ్జెట్ కూడా విడుదల చేసింది. ప్రతి ఏడాది విద్యా సంవత్సరం చివరి రోజున వారిని టర్మినేట్ చేసి.. పాఠశాలలు తిరిగి తెరిచిన తర్వాత మళ్లీ విధుల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు విద్యాశాఖ రీ ఎంగేజ్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు విద్యాశాఖ అధికారులు రీ ఎంగేజ్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు. దీంతో జూన్ 12 నుంచి పాఠాలు చెబుతున్నా.. ఒక రూపాయి కూడా జీతం అందలేదని కాంట్రాక్ట్ ఎస్జీటీ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వారి కోసం విడుదల చేసిన నిధులు ఎస్టీవోల్లో మూలుగుతుండటం గమనార్హం.
కొన్ని జిల్లాల్లో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వేతనాలు ఇవ్వగా.. మరికొన్ని జిల్లాల్లో అవి కూడా ఇవ్వలేదు. దీంతో దాదాపు సగం మంది ఉపాధ్యాయులకు ఫిబ్రవరి నుంచి జీతాలు అందని దుస్థితి. బిల్లులు చేయమని అడిగితే రీ ఎంగేజ్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాతే చేస్తామని మండల అధికారులు కొర్రీలు పెడుతున్నారు. జీతాలు లేక కుటుంబాన్ని పోషించుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తున్నదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం వచ్చిందని, ప్రయాణ ఖర్చులే నెలకు పదివేల వరకు అవుతున్నాయని చెప్తున్నారు. పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నామని, కుటుంబాలు గడపడం కూడా కష్టమైపోయిందని వాపోతున్నారు. దసరా పండుగకు కూడా అప్పులు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ గురుకుల సొసైటీలో పనిచేస్తున్న రెగ్యులర్ టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగుల వేతనాలను సత్వరమే చెల్లించాలని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ టీచర్స్ యూనియన్(టీఎస్‌డబ్ల్యూఆర్‌టీయూ)ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా రెగ్యులర్‌తోపాటు పార్ట్‌టైం, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వేతన బకాయిలు విడుదలచేయాలని విజ్ఞప్తి చేసింది. సకాలంలో వేతనాలు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని.. ఇంటిఅద్దెలు, సూల్ ఫీజులు, ఈఎంఐలు చెల్లించలేక అప్పులపాలు కావాల్సివస్తున్నదని ఆవేదన వ్యక్తంచేసింది.