హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లు త్రిశంకు స్వర్గం లో కొట్టుమిట్టాడుతున్నారు. నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైనా వీరిని కొనసాగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులివ్వలేదు. దీంతో కాంట్రాక్ట్ టీచర్లకు వేతనాలు అందడంలేదు. ఇక ఆగస్టు మాసం ముగింపు దశకు చేరడంతో ఈ నెల వేతనాలు కూడా అందే పరిస్థితి కనిపించడంలేదు. 2008 డీఎస్సీ బాధిత టీచర్లకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచర్ ఉద్యోగాలు కల్పించారు. మొత్తంగా 1,225 మందికి సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ)గా ఉద్యోగాలు ఇచ్చారు. వీరికి నెలకు రూ. 31,040 వేతనం ఖరారుచేశారు.
పాఠాలు చెబుతున్నా.. అందని పైకం
కాంట్రాక్ట్ టీచర్లను ఏటా ఏప్రిల్ 24న ఉద్యోగం నుంచి తొలగించి, తిరిగి జూన్ 12 నుంచి విధుల్లోకి తీసుకుంటున్నారు. రాష్ట్రంలో స్కూళ్లు జూన్ 12న ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచే కాంట్రాక్ట్ టీచర్ల సేవలను విద్యాశాఖ వినియోగించుకుంటున్నది. కానీ జూన్ 12 నుంచి వీరిని కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వులు ఇవ్వకపోవడంపై కాంట్రాక్ట్ టీచర్లు మండిపడుతున్నారు.