హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు సక్రమంగా వేతనాలు చెల్లించడం లేదని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వరర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ విమర్శించారు. జీవో 60, కాంట్రాక్ట్ కార్మిక చట్టాలను అమలు చేయకుండా కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్ల తీరును నిరసిస్తూ హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ కార్యాలయం ఎదుట బుధవారం శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులతో భారీ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని, 2022లో టెండర్ పిలిచినప్పుడు వారికి జీవో 60 ప్రకారం రూ.13,600 జీతం చెల్లిస్తామని చెప్పారని గుర్తుచేశారు. కానీ, అలా వేతనాలు చెల్లించకుండా కార్మికులను కాంట్రాక్టర్లు, అధికారులు దోచుకుంటున్నారని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. అనంతరం కమిషనర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి, ఓమయ్య, తోట రామాంజనేయులు, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వరర్స్ యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఎం లక్ష్మీబాయి, ఉప ప్రధాన కార్యదర్శి హసీనా బేగం, కార్యదర్శులు పీ సురేశ్, ఎస్ కిష్టమ్మ, ఏఐటీసీ నాయకులు సిర్రా దేవేందర్, వినోద్, జె లక్ష్మీ, సర్వేశ్వర్, మదన్‌సింగ్ పాల్గొన్నారు.