Contract Lecturers | ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల అరెస్టులు అన్యాయమని పలువురు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణం అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో తెలంగాణ విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు కాంట్రాక్ట్ లెక్చరర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీల బంద్కు పిలుపునిచ్చామని, అది విజయవంతమైనదని చెప్పారు. నిరసన ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించినప్పటికీ, అధ్యాపకులు, మహిళలు అనే గౌరవం కూడా లేకుండా హింసాత్మక, అన్యాయ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. తమ ఉద్యోగాల సర్వీసును క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత, మూడు శాతం వార్షిక పెరుగుదలతో బేసిక్ + డీఏ+హెచ్ఆర్ఏ వేతనం ఇవ్వాలని అన్నారు. గత 15 నెలల నుంచి వివిధ సందర్భాలలో ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులను కలిసి వినతిపత్రాలు ఇవ్వడం, చర్చించడం జరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తీసుకొచ్చిన జీ.ఓ.నెం.21తో తమ ఉద్యోగాలకు అభద్రత ఏర్పడిందని వాపోయారు. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. తక్షణమే ఆ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తమకు అనుకూలంగా గట్టిగా వాదించి, ఇప్పుడు మౌనంగా ఉండడం బాధాకరమని అన్నారు. స్వార్ధ ప్రయోజనాలతో కొంతమంది అధికారులు తమకు నష్టం చేయాలనే దురుద్దేశంతో ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తూ, అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, తమ దీర్ఘకాల డిమాండ్లను పరిష్కరించేందుకు సరియైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఉదాసీనంగా కొనసాగితే, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాబోయే రోజుల్లో విద్యార్థి సంఘాలు, పౌర సమాజం ఉన్నత విద్యలో న్యాయం కోసం, విలువలకోసం కట్టుబడి ఉన్న ఇతర సంఘాలతో కలిసి తమ ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.