హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలోని మైనారిటీ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు పల్లిపట్టీలు, పౌష్టికాహారం అందించే చిరుతిళ్ల సరఫరా కాంట్రాక్ట్ అప్పగింతలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీజీఎంఆర్ఈఐఎస్) అధికారులపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) తయారు చేసిన ఉత్పత్తులను వినియోగించాలన్న నిబంధనలను బేఖాతరు చేసి, రూ.100 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను నామినేషన్ పద్ధతిలో ఏపీకి చెందిన ట్రూగుడ్ సంస్థకు కట్టబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌లోని కీలకనాయకుడు చక్రం తిప్పినట్టు తెలుస్తున్నది.
‘గిరి’ ఉత్పత్తులను పక్కనబెట్టి
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల విద్యార్థులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) గుర్తింపు కలిగిన గిరిజన సహకార సంస్థ ద్వారా నాణ్యమైన చిరుతిళ్లను సమకూర్చాలి. ఈ మేరకు మిల్లెట్ కుకీలు, పల్లీపట్టీలు కేజీకి రూ.200 చొప్పున సరఫరా చేసేలా జీసీసీతో మహిళా శిశు సంక్షేమశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ట్రూగుడ్ సంస్థ ప్రతినిధులు తాము చిరుతిండ్లు పంపిణీ చేస్తామంటూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కస్తూర్బా తదితర విద్యాసంస్థల అధికారులకు ప్రతిపాదనలు పంపారు. ట్రూగుడ్ కంపెనీ ఉత్పత్తులకు మార్కెట్లో మంచిపేరు లేకపోవడంతో మైనారిటీ విద్యాసంస్థ తప్ప.. అన్ని శాఖలు తిరస్కరించాయి. మైనారిటీ విద్యాసంస్థ అధికారులు మాత్రం ట్రూగుడ్ సంస్థకు కాంట్రాక్టు కట్టబెడుతూ మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శికి ప్రతిపాదనలు పంపించారు. కార్యదర్శి కూడా ఆమోదం తెలుపడంతో ఈ నెల 16న ఉత్తర్వులు వెలువడ్డాయి.
టెండర్ లేకుండానే ఎలా ఇస్తారు?
రూ.100 కోట్ల విలువైన చిరుతిళ్ల సరఫరా కాంట్రాక్ట్‌ను టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్లో ట్రూగుడ్ సంస్థ ఉత్పత్తులకు మంచి పేరులేకున్నా, ఐఐఎంఆర్ ధ్రువీకరణ లేకున్నా కాంట్రాక్ట్ ఇవ్వడం వెనుక ఆంతర్యమేంటని ప్రభుత్వ అధికారులే ప్రశ్నిస్తున్నారు. ఏపీలోని విద్యాసంస్థలకు కేజీ చిరుతిండ్లను రూ.118కు సరఫరా చేస్తున్నది. తెలంగాణ విద్యాసంస్థకు మాత్రం రూ.225 చొప్పున ఇస్తున్నది. గిరిజన సహకార సంస్థను బలోపేతం చేయడం మానుకుని, పిల్లలకు నాణ్యమైన చిరుతిండ్లు సరఫరా చేయాలన్న ఆలోచన విస్మరించడం దుర్మార్గమని అధికారులు మండిపడుతున్నారు. అక్రమ కాంట్రాక్ట్‌పై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.