హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఉద్యోగాల భర్తీని చేపట్టకపోగా ఉన్న ఉద్యోగులకు కూడా వేతనాలు సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్యులకు 3 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా జీవో గడువు ముగిసిందంటూ వారందరినీ వేదనకు గురిచేస్తున్నది. రాష్ట్రంలోని సర్కారు దావఖానాల్లో వైద్యుల కొరతను అధిగమించేందుకు నోటిఫికేషన్ జారీచేయకుండా జీవో నంబర్ 98 ప్రకారం ప్రకటన విడుదల చేసి కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీలను భర్తీ చేశారు. తద్వారా 650 మందికిపైగా ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల హోదా కలిగిన వైద్యులు కాంట్రాక్ట్ వైద్యులుగా నియమితులయ్యారు.
ఆ జీవో ప్రకారం వారంతా ఈ ఏడాది మార్చి వరకే వైద్యసేవలు అందించాల్సి ఉన్నది. ఏప్రిల్ నుంచి వారంతా వైదొలిగే అవకాశం ఉన్నప్పటికీ మరో నోటిఫికేషన్ విడుదలకు సమయం పడుతుందని ప్రభుత్వం భావించి, వారిని అలాగే కొనసాగించింది. కానీ, జీవో 98 ప్రకారం వారి గడువు ముగిసిందని పేర్కొంటూ.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే 3 నెలల వేతనాలను నిలిపివేసింది. ఈ సమస్యను పరిష్కరించాలని ఇదివరకే హెల్త్ సెక్రటరీ, డీఎంఈలను కలిసి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోయిందని కాంట్రాక్ట్ వైద్యులు వాపోతున్నారు. కొత్త నోటిఫికేషన్ను జారీచేసే వరకు జీవో 98ను పొడిగించి తమ వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.