హైదరాబాద్ : రాష్ట్రంలో వానలు (Heavy rains) దంచికొడుతున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశాయాలు నిండు కుండలను తలిపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. కాగా, కామారెడ్డి జిల్లాలోని భారీ నీటి పారుదల ప్రాజెక్టు నిజాం సాగర్(Nizamsagar) నుంచి దిగువ మంజీరకు(Manjeera) నీటి విడుదల కొనసాగుతుంది. ఎగువ నుంచి 28,200 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండటంతో ఒక గేటు ఎత్తి 2వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
1405 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి గాను 1404.40 అడుగులకు చేరింది. 17.802 టీఎంసీల పూర్తి స్థాయి నీటి సామర్థ్యం ఉండగా 16.935 టీఎంసిలకు చేరింది. కాగా, భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు.