హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారుల కేసులు వేగంగా పరిష్కారం అవుతున్నాయి. అత్యధిక కేసులను పరిష్కరించి హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-2 అగ్రస్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో నిజామాబాద్, వరంగల్ కమిషన్లు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర కమిషన్ కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ నివేదికకు నివేదిక సమర్పించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల కన్జ్యూమర్ డిస్పూట్స్ రీడ్రెస్సల్ కమిషన్ పరిధుల్లో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను తెలిపింది. హైదరాబాద్ కన్జ్యూమర్ కమిషన్-2లో ఆరునెలల కాలంలో 278.89 డిస్పోజల్ (పరిష్కార) రేటు నమోదైంది. ఇటీవల 443 కేసులు పెండింగ్‌లో ఉండగా కొత్తగా మరో 90 కేసులు నమోదయ్యాయి. మొత్తం 533 కేసులకుగాను 251 కేసులను పరిష్కరించింది. రెండోస్థానంలో నిజామాబాద్ 226.83 డిస్పోజల్ రేటు ఉండగా, వరంగల్ 206.98 రేటుతో మూడో స్థానంలో నిలిచింది. 202.38 రేటుతో మహబూబ్‌నగర్ నాలుగో స్థానం దక్కించుకున్నది. రాష్ట్ర కమిషన్‌లో 98.57 శాతం డిస్పోజల్ రేటుగా నమోదైంది. అత్యంత తక్కువగా ఆదిలాబాద్ 62.82గా రికార్డయింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కమిషన్లు ఇవే
తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌తోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, హైదరాబాద్ (పరిధిలో మూడు కమిషన్లు హైదరాబాద్-1, 2, 3), రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కమిషన్లు ఉన్నాయి. వినియోగదారుల కేసుల్లో న్యాయాన్ని చేకూర్చే విధంగా ఈ కమిషన్లు తీర్పులు వెలువరిస్తున్నాయి.