హైదరాబాద్, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ శివార్లలో అభివృద్ధి చేయతలపెట్టిన గ్రీన్ ఫార్మాసిటీ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని ముచ్చర్ల ప్రాంతంలో చేపట్టనున్న గ్రీన్ ఫార్మాసిటీ ప్రణాళికలపై సోమవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి అధికారులతో చర్చించారు. పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధి జరగాలని, పర్యావరణహితంగా, కాలుష్యరహితంగా ఉండేలా అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలను త్వరగా కల్పించాలని చెప్పారు. గ్రీన్ఫార్మా సిటీలో పెట్టుబడులకు ఇప్పటికే పేరొందిన ఔషధ కంపెనీలు ముందుకొస్తున్నాయని, త్వరలోనే ఆ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. ఔషధాల తయారీతోపాటు పరిశోధన, శిక్షణ, నైపుణ్యాలకు అవసరమైన ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటుచేస్తామని తెలిపారు. హెల్త్ కేర్, ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా అందులో కోర్సులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ శషాంక్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ కలెక్టరేట్‌కు ఇండ్ల దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. దరఖాస్తులను భద్రపర్చటానికి ట్రంక్ పెట్టెలు సరిపోవడం లేదని వాపోతున్నారు. ప్రజవాణిలో 150 దరఖాస్తులు వస్తే, 110 ఇండ్ల దరఖాస్తులే ఉంటున్నాయని చెబుతున్నారు. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రజలు తమకు పథకాలు వర్తించడం లేదని దరఖాస్తులు ఇస్తున్నారు. తమ సమాచారాన్ని తిరిగి పొందుపర్చుకునేందుకు కలెక్టరేట్‌కు పోటెత్తుతున్నారు. అటు ఇండ్ల దరఖాస్తుదారులు, అటు ఆరు గ్యారంటీల అప్డేట్ కోసం వచ్చే వారితో కలెక్టరేట్ కోలాహలంగా మారింది.