Budget | హైదరాబాద్, మార్చి19 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలకూ బడ్జెట్లో ప్రాధాన్యం దక్కలేదు. అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తామని సర్కారు చెప్పిన మాటలన్నీ వట్టివేనని ఈ బడ్జెట్ కేటాయింపులే తేల్చిచెప్పాయి. భవనాల నిర్మాణాలకు అరకొర నిధులు కేటాయించి సర్కారు మొండిచేయి చూపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలన్నీ కలిపి ఒకే సముదాయంలో ఏర్పాటు చేస్తామని చెప్పడమేగాక, నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఈ సూళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. తొలుత వికారాబాద్ జిల్లా కొడంగల్, ఖమ్మం జిల్లా మధిర, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గాల్లో గురుకుల భవన నిర్మాణాలకు ఆడంబరంగా శంకుస్థాపనలు చేసింది. ఇటీవలే మరో 55 నియోజకవర్గాలకు స్కూల్ భవనాలను మంజూరు చేసింది.
ఒక్కో గురుకుల భవన నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు రూ.200 కోట్లు అవసరమని అంచనా వేసి, మొత్తంగా తొలిదశలో 58 గురుకుల భవనాలకు రూ.11,600 కోట్లతో పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. మిగతా 58 నియోజకవర్గాలకు మరో రూ.11,600 కోట్లు.. మొత్తంగా119 నియోజకవర్గాల్లో గురుకుల భవనాలను నిర్మించాలంటే రూ.23,200 కోట్లు అవసరం. తొలిదశలో మంజూరు చేసిన 58 గురుకులాలు నిర్ణీత సమయంలో పూర్తికావాలంటే ప్రతి బడ్జెట్లో దాదాపు రూ.6,000 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. తీరా బడ్జెట్ చూస్తే అందులో సగం కూడా కేటాయించకపోవడం గమనార్హం. ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ఈ బడ్జెట్లో మొత్తంగా రూ.2,900 కోట్లను మాత్రమే నామమాత్రంగా కేటాయించింది. ఈ లెక్కన క్రమం తప్పకుండా బడ్జెట్ కేటాయించినా తొలిదశలోని 58 భవనాల నిర్మాణాలకే నాలుగేండ్లు పట్టే అవకాశం ఉండగా, మిగతా 58 భవనాల నిర్మాణాలను ఎప్పుడు పూర్తిచేస్తారో!