కరీంనగర్ : కరీంనగర్లో ఉత్తర తెలంగాణ దివ్య క్షేత్రంగా టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏడాదిన్నరలోగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. నగరంలోని పద్మానగర్ పశుసంవర్ధక శాఖ ఆవరణలోని స్థలాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ సునీల్ రావు, టీటీడీ హైదరాబాద్ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ భాస్కర్ రావు, నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండీ దీవికొండ దామోదరరావు, ఈఈ నరసింహ మూర్తి, స్థపతి రవికాంత్ తదితరులతో కలసి పరిశీలించారు.
ల్యాండ్ సర్వే సహాయ సంచాలకులు అశోక్, సర్వేయర్లు మంత్రికి స్థల కొలతలను వివరించారు. సుమారు పది ఎకరాల స్థలంలో స్వామి వారి ఆలయం నిర్మాణం జరుగుతుందని మంత్రి తెలిపారు. భక్తులకు అత్యంత ప్రీతి పాత్రుడైన శ్రీనివాసుని ఆలయాన్ని సీఎం కేసీఆర్ సంకల్పంతో భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, కార్పొరేటర్లు, అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.