నిజాంసాగర్, జనవరి 11: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో చేపట్టిన నాగుమడుగు ఎత్తిపోతల పథకంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. నాన్ కమాండ్ ఏరియాకు సాగునీరు అందించే లక్ష్యంగా మంజీరా నదిపై ఎత్తిపోతల పనులు చేపట్టగా, కరకట్టలు, పంప్‌హౌస్‌ల నిర్మాణం, పైపుల తవ్వకం పనులపై అభ్యంతరాలు వస్తున్నాయి. మరోవైపు రైతు లు భూములిచ్చేందుకు అయిష్టత చూపుతున్నారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో నిజాంసాగర్ నీటిని వరద గేట్ల ద్వారా మంజీరాలోకి వృథాగా విడుదల చేస్తున్నారు. దీంతోపాటు నల్లవాగు మత్తడి చిన్నపాటి వర్షానికి పొంగి మంజీరాలోకి ప్రవహిస్తుంటుంది. దీన్ని గమనించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం నీటిని నిజాంసాగర్‌లోకి మళ్లింపు చేపట్టింది.
అవసరమైతే కాళేశ్వరం నీటిని నిజాంసాగర్‌కు విడుదల చేసి ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా మంజీరాలోకి విడుదల చేసి నాగమడుగు మత్తడికి సాగునీరు అందించాలని భావించిం ది. నిజాంసాగర్ దిగువ నీటిని సద్వినియోగం చేసుకుంటూ నాన్ కమాండ్ ఏరియాకు సాగు నీటి వసతి కల్పించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో నాగమడుగు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. రూ.476 కోట్లతో చేపట్టిన ఈ పథకం ద్వారా నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్, బిచ్కుంద, మండలాల్లోని 40వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని సంకల్పించింది. నిజాంసాగర్ మండలం ఒడ్డెపల్లి, జక్కాపూర్, మల్లూర్, కోమలంచ, గ్రామాల శివారులో ఉన్న మంజీరా నదిలో ఎత్తి పోతల పథకాలు ప్రారంభమయ్యాయి. నదిలో అడ్డుగోడ నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటివరకు కేవలం 15 శాతం పనులు పూర్తికాగా, రూ.60 కోట్ల వరకు బిల్లులు చెల్లించారు.
ముంపు రైతుల ఆందోళన
మంజీరా నదిలో అడ్డుగోడతో పాటు నదికి రెండు వైపులా కరకట్ట, పంప్‌హౌస్‌ల నిర్మా ణం పైపులైన్ల ఏర్పాటుపై రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కరకట్టలను 6 నుంచి 9 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే సాగు భూములు మునిగిపోతాయని, అడ్డుగోడతో, కరకట్టతో ఏడు కిలోమీటర్ల మేర నీరు నిల్వ ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. ఎత్తిపోతల పనుల్లో 300 ఎకరాల భూములు ముంపునకు గురవుతుండగా, ప్రభుత్వం ఎకరాకు రూ.17 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నది. అయితే ఎకరాకు రెట్టింపు పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. దీంతో భూ సేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
నిధులు రావడం లేదు
నాగమడుగు మత్తడి కోసం 300 ఎకరాల భూ సేకరణ జరగాల్సి ఉన్నది. ఇప్పటివరకు 32 ఎకరాలే సేకరించాం. ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. దీనికితోడు రైతులు అభ్యంతరాల వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయి. మత్తడి ఎత్తు తగ్గించాలా? లేదా రబ్బర్ డ్యాం నిర్మించాలా? అని ఆలోచిస్తు న్నాం. ఎత్తు తగ్గిస్తే ఆయకట్టు సాగునీటి అందించే అంశాన్నీ పరిశీలిస్తున్నాం.
– సొలోమాన్, ఈఈ