హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : చిరుధాన్యాలపై ఆవిష్కరణలు, పరిశోధనలు, విస్తరణకు ప్రాధాన్యం కల్పించేందుకు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ(ఐఐఎంఆర్)లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఆన్ మిల్లెట్స్(జీసీవోఈఎం) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ. 250 కోట్ల అంచనా వ్యయంతో 4 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దీన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ పనులను ప్రారంభించారు.
ఏడాదిలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఐఐఎంఆర్ డైరెక్టర్ తారా సత్యవతి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్ల ఉత్పత్తి, ఉపయోగాన్ని ప్రోత్సహించడం, సాగులో వాతావరణ మార్పులను ఎదురోవడానికి ఉపయోగపడేలా ఐఐఎంఆర్‌లో జీసీవోఈఎం నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. జీసీవోఈఎం తెలంగాణకు, దేశానికి, ప్రపంచానికి ఓ వరమని, చిరుధాన్యాలను విశ్వవ్యాప్తం చేయడానికి దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.