హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. రూ.19,329 కోట్ల వ్యయంతో 2.91 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకొన్న ప్రభుత్వం ఇప్పటివరకు 1.85 లక్షల నిర్మాణాలను పూర్తిచేసింది. పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు అందించే ప్రక్రియ ఊపందుకొన్నదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. బిల్లుల విడుదలలో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తున్నామని పేర్కొన్నది. కాంట్రాక్టర్లు బిల్లులు సమర్పించిన 15 రోజుల్లో నిధులు విడుదల చేస్తున్నామని తెలిపింది. ఇండ్ల డిజైన్, లే-ఔట్, నిర్మాణంలో “ఆన్లైన్ ప్రాజెక్ట్ మానిటరింగ్ సిస్టమ్(వోపీఎంఎస్)” ద్వారా మెరుగైన పనితీరుకు ఇటీవలే జాతీయ స్థాయి హడ్కో అవార్డు కూడా దక్కినట్టు వెల్లడించింది.
