B-Hub | హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ఐటీ రంగంలో నైపుణ్యంగలవారు స్టార్టప్‌లు ఏర్పాటు చేసేలా తీర్చిదిద్దుతున్న టీ -హబ్ తరహాలోనే లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేయాలని తపించే యువతకు తోడ్పాటు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘బయోఫార్మా హబ్’ ఏర్పాటు చేస్తున్నది. జీనోమ్ వ్యాలీలో నిర్మిస్తున్న ఈ ‘కలల’ సౌధాన్ని ‘బీ-హబ్’ అని పిలుస్తున్నారు. ఇది ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనల నుంచి పుట్టింది.
ప్రపంచం మొత్తం ఇప్పుడు ‘బయో ఫార్మాస్యూటికల్స్’ రంగంవైపు చూస్తున్నది. దీర్ఘకాలిక, తీవ్రమైన వ్యాధులకు ఈ రంగం పరిషారం చూపుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు, పరిశోధన సంస్థల్లో దాదాపు 50 శాతం బయో ఫార్మాస్యూటికల్స్‌పై దృష్టిసారించారు. ఇప్పటికే లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లలో ఒకటిగా ఉన్న జీనోమ్ వ్యాలీలో ‘బయో’ స్టార్టప్‌లను ప్రోత్సహించాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఫార్మా రంగంలో లీడర్‌గా ఉన్న తెలంగాణ.. బయోఫార్మా రంగంలోనూ అగ్రస్థానానికి చేరుకోవాలని మంత్రి కేటీఆర్ లక్ష్యంగా పెట్టుకొన్నారు.
బీ -హబ్‌లో సెల్ కల్చర్ మొదలు ఫిల్టరేషన్ యూనిట్లు, క్రొమాటోగ్రఫీ ప్రాసెసింగ్.. ఇలా పరిశోధనలు, ‘ప్రీ క్లినికల్ ట్రయల్స్ ’ చేసేలా సకల వసతులు ఉంటాయి. స్టార్టప్‌లతోపాటు మధ్యస్థాయి, పెద్ద ఫార్మా సంస్థలు ఇకడ పరిశోధనలు చేసేందుకు సదుపాయాలు ఉంటాయి. దీంతో ఆయా సంస్థలు ఒకేసారి పెద్ద మొత్తంలో వెచ్చించి ప్రత్యేక ల్యాబ్‌లు ఏర్పాటు చేసుకొనే భారం తప్పుతుంది. సమయం భారీగా కలిసివస్తుంది. తద్వారా వేగంగా పరిశోధనలు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తులను తయారుచేసి మారెట్లోకి ప్రవేశపెట్టేందుకు అవకాశం కలుగుతుంది.
ఇప్పటికే ప్రపంచ ఫార్మా దిగ్గజంగా ఉన్న ఇండియా ‘బయోఫార్మా’లోనూ అడుగుపెట్టి లీడర్‌గా ఎదగాల్సిన సమయం ఆసన్నమైంది. బయోఫార్మా పరిశోధనలు చేపట్టాలంటే ఇప్పుడున్న ల్యాబ్‌లకు భిన్నంగా.. ప్రత్యేకంగా ల్యాబ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మూల పదార్థాలను గుర్తించి, సేకరించి.. వాటిని సమర్థంగా ప్రాసెస్ చేయడంతోపాటు పరిశోధనలు జరిపి నాణ్యమైన ఔషధాలను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కంపెనీలు ఓ వైపు ఇలాంటి పరిశోధనలు చేస్తూ, మరోవైపు మారెటింగ్ వ్యూహాలు, అనుమతుల ప్రక్రియను నిర్వహించాల్సి ఉంటుంది. కంపెనీలకు ఈ శ్రమను తగ్గించేలా, స్టార్టప్‌లను ప్రోత్సహించేలా సకల వసతులు, శాస్త్రవేత్తలు సౌకర్యవంతంగా పరిశోధనలు చేయగలిగేలా అత్యాధునిక ల్యాబొరేటరీ మన దేశంలో ఎకడాలేదు. దీనికి పరిష్కారంగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బీ-హబ్ నిలువనున్నది. దేశానికే ఆదర్శం కానున్నది.