హైదరాబాద్, జనవరి 18(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో పాలకమండలి ఏర్పాటుకానున్నది. ఇందుకు సంబంధించి దేవాదాయశాఖ చట్టంలో స్వల్ప సవరణలు చేయగా, వాటికి న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బోర్డు ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలను ఖరారుచేసిన దేవాదాయ శాఖ.. దస్ర్తాన్ని ముఖ్యమంత్రి ముందుంచింది. వచ్చే క్యాబినెట్లో ఈ బిల్లును ఆమోదించి ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యా దాద్రి ఆలయాన్ని దాదాపు రూ.1200 కోట్లతో అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన, రవాణా కనెక్టివిటీ తదితరాలతో ఆలయానికి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి ఆలయానికి టీటీడీ తరహాలో పాలకమండలిని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. వచ్చే క్యాబినెట్లో దీనికి ఆమోదం లభిస్తుందని, అనంతరం ఆర్డినెన్స్ ద్వారా పాలకమండలిని అమలుచేస్తారని సమాచారం. పాలకమండలిలో చైర్మన్తో సహా 20 మంది వరకు సభ్యులు, మూడేండ్లపాటు పదవీకాలం ఉండనున్నట్టు తెలిసింది.