జూబ్లీహిల్స్, జనవరి 25 : సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్(సీడీఎస్) ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ దళిత్ స్టడీస్, సెంటర్ ఫర్ దళిత్ రైట్స్, నేషనల్ అలయన్స్ ఫర్ సోషల్ జస్టిస్, దళిత్ కొలిషన్, పీపుల్స్ క్యాంపెయిన్ ఫర్ సోషియో ఎకనామిక్ ఈక్విటీ, దళిత్ బహుజన ఫ్రంట్, నేషనల్ మూవ్మెంట్ ఫర్ ల్యాండ్ లేబర్ అండ్ జస్టిస్, దళిత్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ నెట్వర్క్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ లీడర్స్ సంయుక్తంగా రెండు రోజులపాటు నిర్వహిస్తున్న రాజ్యాంగ కాన్క్లేవ్-2026 ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎస్పీఆర్ హిల్స్‌లోని సీడీఎస్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రారంభమైంది. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య స్వాగతోపాన్యాసం చేస్తూ.. 75 ఏండ్ల ఉత్సవాలను పురస్కరించుకుని రాజ్యాంగంపై 75 ఉపన్యాసాల ప్రస్థానాన్ని, బీఆర్ అంబేద్కర్ ప్రతిపాదించిన సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం విలువలను పరిరక్షించాల్సిందిగా పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కాకి మాధవరావు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో ప్రొఫెసర్ రోంకీరామ్ పంజాబ్‌లోని ఆదిధర్మ ఉద్యమం, దళితుల ఓటుహక్కు చైతన్యం, అంబేద్కర్ నాయకత్వానికి లభించిన మద్దతు గురించి వివరించారు.
కీ నోట్ ప్రసంగంలో హర్యానా ఐఏఎస్ రాజశేఖర్.. ఆర్టికల్స్ 14,15,16,17లను వివరిస్తూ వివక్షకు బలమైన చట్టపరిహారాలు అవసరమని చెప్పారు. టీఎస్సీహెచ్ఈ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఆర్టికల్ 15(5)పై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నత విద్య ప్రైవేటీకరణ కారణంగా దళితులు, ఆదివాసీలు విద్యావకాశాలకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. నియోలిబరల్ ఆర్థిక విధానాలు, పెరుగుతున్న అసమానతలు రాజ్యాంగ అస్తిత్వానికి సవాల్‌గా మారుతున్నాయని పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారి, ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచనలు కేవలం దళితుల అభ్యన్నతికే కాకుండా, మహిళలు, అణగారినవర్గాలకు అం డగా ఉన్నట్టు తెలిపారు. రెండో సెషన్లో ‘బీఆర్ అంబేద్కర్.. రాజ్యాంగ న్యా యపునాదులు’ అనే అంశంపై ప్రొఫెసర్ కోదండరామ్‌తోపాటు ప్రొఫెసర్ మహేంద్రకుమార్ ఆనంద్, ప్రొఫెసర్ నరేందర్‌కుమార్, అంబుజాక్సన్, ఉమేశ్, శుభజిత్ నస్కర్, జగన్నాథ్ ప్రసంగించారు. మూడో సెషన్లో ‘సామాజిక న్యా యం..రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు’ అనే అం శంపై సుఖదేవ్ విశ్వప్రేమి, డీఎన్ రెడ్డి, రామ్‌కుమార్, విజయ్‌కుమార్, రంగనాథన్ ప్రసంగించారు.