హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగం మన జీవన మార్గమని, దేశ నాగరికతకు ప్రతిరూపమని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం హైకోర్టు ఆవరణలో జరిగిన వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రాజ్యాంగ పరిషత్ చైర్మన్ డాక్టర్ బీఆర్ అంబేదర్తోపాటు ఎంతో మంది ప్రముఖల లోతైన కృషితో రాజ్యాంగం ఏర్పడిందని, రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ప్రజాస్వామ్య బలోపేతానికి దోహదపడుతుందని తెలిపారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి పౌరునిపై ఉన్నదని స్పష్టం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ.. అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సమాన హక్కులు కల్పిస్తున్న మన రాజ్యాంగం దేశ సమగ్రతకు, సమైక్యతకు దోహదపడుతున్నదని చెప్పారు. అనంతరం పలువురు సీనియర్ న్యాయవాదులను సన్మానించారు. హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు దీప్తి, కార్యదర్శి శాంతి భూషణ్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.