Telangana | నెక్కొండ, నవంబర్ 4 : వరంగల్ జిల్లా నెక్కొండ పోలీస్ స్టేషన్లో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు లంచం డబ్బుల కోసం ఘర్షణ పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయం సోషల్ మీడియాలో సోమవారం వైరల్ అయ్యింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కొన్ని రోజుల కిందట నెక్కొండ ఎస్సై మహేందర్ సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీస్స్టేషన్ బాధ్యతలను ఓ హెడ్కానిస్టేబుల్కు అప్పగించారు.
అతడు ఓ ఫిర్యాదుదారుడి నుంచి రూ.వెయ్యి లంచం తీసుకున్నాడు. మరో హెడ్ కానిస్టేబుల్ తన వాటా అడగడంతో గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నట్టు సమాచారం. ఈ ఘటన అక్టోబర్ 27న జరగ్గా, సీఐ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సి ఉన్నది. కాగా, డ్యూటీల విషయంలో ఇద్దరు హెడ్కానిస్టేబుళ్లు ఘర్షణ పడినట్టు పోలీసులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.