హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాజా బహదూర్ వెంకటరామ రెడ్డి తెలంగాణ పోలీసు అకాడమీలో శిక్షణ పొందిన కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ (Passing Out Parade) ఘనంగా జరుగుతున్నది. దీంతో 1211 మంది సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్ సీపీఎల్, ఐటీఅండ్‌సీ, పీటీవో కానిస్టేబుళ్లు త్వరలో విధుల్లో చేరనున్నారు. ఈ కార్యక్రమానికి డీజీపీ జితేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. వారితో అకాడమీ చీఫ్ అభిలాష బిస్త్ ప్రమాణం చేయించారు. పరేడ్‌కు జనగామ జిల్లా పాలకుర్తి మండలం తిరుమగిరికి చెందిన కుమారి ఉప్పునూతల సౌమ్య కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారిలో సివిల్ 560, ఏఆర్ 278, ఏఆర్ సీపీఎల్ 292, ఐటీ అండ్ సీ 81 మంది ఉన్నారు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2022 ఏప్రిల్‌లో 16,604 కానిస్టేబుల్, 587 ఎస్సై తత్సమాన ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిల్లో 587ఎస్సై ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించి గతేడాది ఆగస్టులోనే నియామకపత్రాలు అందించారు. ఇక కానిస్టేబుల్ తుది ఫలితాలు గతేడాది అక్టోబర్‌లోనే విడుదలయ్యాయి. ట్రాన్స్లేషన్ సమస్యపై అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లడం.. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో తుది ఫలితాలు ఆలస్యమయ్యాయి. ఈ ఏడాది ఆరంభంలో సుప్రీంకోర్టులో టీఎస్ఎల్పీఆర్బీ కేసు గెలడంతో భర్తీ ప్రక్రియ ముగిసింది.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా 9 నెలల పాటు 8,047 మంది కానిస్టేబుళ్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో 2,338 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండగా.. 5,709 మంది పురుషులు ఉన్నారు. శిక్షణ పొందిన కానిస్టేబుళ్లలో డిగ్రీ పూర్తి చేసినవారు 5,470, పీజీ చేసినవారు 1,361, టెక్నికల్ బ్యాగ్రౌండ్ ఉన్నవారు 1,755, నాన్ టెక్నికల్ విభాగం నుంచి 5,505, ఎల్ఎల్బీ చేసిన వారు 15 మంది ఉన్నట్టు వివరించారు.