జీడిమెట్ల, జూన్ 22 : విధి నిర్వహణలో భాగంగా తనిఖీలకు వెళ్లిన ఎస్వోటీ కానిస్టేబుల్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మచిలీపట్నానికి చెందిన ప్రవీణ్ కుమార్(38) చింతల్ బాపునగర్ శ్రీసాయి భవన్ అపార్టుమెంట్లో నివాసం ఉంటూ.. బాలానగర్ జోన్ ఎస్వోటీ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.
శనివారం కుత్బుల్లాపూర్ ఎన్టీఆర్నగర్లో గంజాయి తనిఖీలకు వెళ్లగా.. అర్ధరాత్రి గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని చింతల్‌లోని ఓ దవాఖానకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందాడని ధ్రువీకరించారు. భార్య జానకీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాపునగర్‌లో ఆదివారం కానిస్టేబుల్ ప్రవీణ్ అంత్యక్రియలను పోలీస్ లాంచనాలతో నిర్వహించారు. బాలానగర్ ఎస్వోటీ డీసీపీతోపాటు పోలీస్ అధికారులు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు.