గోల్నాక, జనవరి 31 : తెలంగాణ పోలీస్‌శాఖలో మరో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ మాదన్నపేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంబర్పేట్ దుర్గానగర్‌లోని నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అంబర్పేట్ సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేటకు చెందిన వెంకటేశ్వర్లు (42)కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. 2007 బ్యాచ్‌కు చెందిన వెంకటేశ్వర్లు గురువారం ఇంట్లో ఉరి వేసుకున్నాడ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు చెప్పారు.
మరోవైపు కొంతకాలంగా పోలీస్‌శాఖలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు కానిస్టేబుళ్ల నుంచి అధికారుల వరకు వివిధ సందర్భాల్లో ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబాలు రోడ్డెక్కిన ఘటనలు సంచలనం రేకెత్తించాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఆత్మహత్యలపై పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం దృష్టి సారించాలని, క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమస్యలను తెలుసుకుని, పరిష్కారం చూపాల్సిన అవసరముందని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.