హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న ఆదివాసీ, బంజారా గిరిజనుల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్నుతారని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు రూప్సింగ్ మండిపడ్డారు. విడగొట్టి, రాజకీయాలు చేయాలని చూస్తే ఆదివాసీగూడెలు, గిరిజనతండాలు ఏకమై తరిమి కొడతాయని కాంగ్రెస్, బీజేపీ నేతలను హెచ్చరించారు. శనివారం ఆయన తెలంగాణభవన్‌లో గిరిజన నాయకులు ప్రొఫెసర్ రమణానాయక్, లోకిని రాజు, గోవర్ధన్, సాయి, వనం రాకేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తీసేస్తామంటున్న బీజేపీ ఎంపీ సోయం బాపూరావు వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. ఏపీ పునర్వవస్థీకరణ చట్టం హామీ ప్రకారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీని ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని నిలదీశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మూడువేలకు పైగా గిరిజన గూడెలు, తండాలను గ్రామ పంచాయతీలుగా చేసినట్టుగానే, బీజేపీ రాష్ట్రాల్లోనూ చేసే దమ్ముందా? అని సవాలు చేశారు. ముస్లింకు రిజర్వేషన్లు కావాలన్నందునే గిరిజనులకు రిజర్వేషన్లు పెరగడం లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొనడం అర్థరహితమని మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్లకు కాంగ్రెస్ అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాలకు సమన్యాయం చేస్తున్నారని ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు అన్నారు. అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించడమే కాకుండా సబ్బండవర్గాలు పురోగమించాలన్న గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని ప్రొఫెసర్ రమణానాయక్ పేర్కొన్నారు. గిరిజన కుటుంబ నేపథ్యంగా కల్యాణలక్ష్మి పథకానికి అంకురార్పణ చేయడం గొప్ప విషయమని రాంబాబునాయక్ అన్నారు.